అతడే నన్ను 'పవర్ ప్లే' బౌలర్‌గా మార్చేశాడు.. నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లా: దీపక్ చహర్

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ తనను 'పవర్ ప్లే' బౌలర్‌గా తీర్చిదిద్దాడని భారత యువ పేసర్ దీపక్ చహర్ తెలిపాడు. బాధ్యతలు ఎలా స్వీకరించాలో మహీ భాయ్ నేర్పించాడన్నాడు. ఐపీఎల్‌లో మహీ సారథ్యంలోని చెన్నై తరపున ఆడే చహర్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది చహర్‌తో పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేయించిన ధోనీ.. ఊహించనిరీతిలో ఫలితాలు రాబట్టాడు. మహీ సూచనలతో పొదుపుగా బౌలింగ్ చేసిన చహర్.. ప్రత్యర్థి ఓపెనర్ల వికెట్లని పడగొడుతూ వచ్చాడు.

పవర్ ప్లే బౌలర్‌గా తీర్చిదిద్దాడు:
తాజాగా దీపక్ చహర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా సుదీర్ఘ కల. అది నెరవేరింది. అతని సారథ్యంలో ఎంతో నేర్చుకున్నా. నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లా. అతనెప్పుడూ నాకు మద్దతుగానే నిలుస్తాడు. బాధ్యతలు ఎలా స్వీకరించాలో నేర్పించాడు. మా చెన్నై జట్టులో నేను మినహా పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేసే బౌలర్లు ఎవరూ లేరు. అందుకు కారణం మహీ భాయ్. ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ అతను నన్ను పవర్ ప్లే బౌలర్‌గా తీర్చిదిద్దాడు' అని అన్నాడు.

ఎలా వాడుకోవాలో ధోనీకి తెలుసు:
'నువ్వు నా పవర్ ప్లే బౌలర్‌వి అని మహీ భాయ్ పదేపదే నాకు చెప్తుంటాడు. అతని మాటలు, సలహాలు మెరుగైన బౌలర్‌గా ఎదిగేందుకు నాకు ఉపయోగపడుతున్నాయి. టీ20ల్లో పరుగుల్ని కట్టడి చేయడాన్ని నేర్చుకున్నా. ఓ ఆటగాణ్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసు. ఇక టెస్టు క్రికెట్ ఆడాలనే నా అంతిమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమిస్తున్నా' అని దీపక్ చహర్ తెలిపాడు. చహర్ భారత్ తరఫున 3 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 20 వికెట్లు పడగొట్టాడు. ఇక 55 టీ20 మ్యాచులో 53 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ధావన్ సరైనోడు:
శ్రీలంకలో పర్యటించే భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్‌గా శిఖర్ ధావన్ సరైనోడని దీపక్ చహర్ అభిప్రాయపడ్డాడు. 'శ్రీలంకతో సిరీస్‌కు జట్టు కెప్టెన్‌గా ధావన్ సరైనోడు. సుదీర్ఘ కాలం నుంచి అతను జట్టుకు ఆడుతున్నాడు. ఎంతో అనుభవం సాధించాడు. అలాంటి సీనియర్ ఆటగాడు కెప్టెన్ కావాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే సీనియర్‌ను జట్టులోని మిగతా ఆటగాళ్లు గౌరవిస్తారు. నిజాయతీగా చెప్పిన మాటలు వింటారు' అని పేర్కొన్నాడు. లంక పర్యటనలో భారత పేస్ విభాగంలో చహర్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ కూడా ఉన్నారు.

లంక పర్యటనకు సిద్ధం:
'లంక పర్యటనకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నా. ఐపీఎల్‌లో మెరుగ్గానే బౌలింగ్ చేశా. మంచి లయతో ఉన్నా. లంకలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. అనుభవమే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నమ్ముతా. ఇప్పుడు నాకు ఆ అనుభవం ఉంది. శ్రీలంకలో మంచి ప్రదర్శన చేస్తాననే నమ్మకమూ ఉంది. మా ద్వితీయ శ్రేణి బృందం ప్రధాన జట్టులాగే కనిపించే వీలుంది. కచ్చితంగా ఈ సిరీస్‌లో విజేతగా నిలుస్తాం. మాకు చాలా అవకాశాలున్నాయి' అని దీపక్ చహర్ చెప్పుకొచ్చాడు. భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications