స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. డారిల్ మిచెల్ (61; 27 బంతుల్లో) విశ్వరూపం చూపించాడు. నాలుగు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. మరోవైపు 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (57; 42 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో బంతికే ఓపెనర్ కాన్వాయ్‌ను డకౌట్ చేసింది. తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులే ఇచ్చింది. కానీ ఆ తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కాన్వాయ్ వికెట్ తీసి జోరు మీదున్న షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాది.. ఫిన్ అలెన్ మూడో ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. అదే జోరును కొనసాగిస్తూ పరుగులు చేశాడు. అయితే అరంగేట్ర ప్లేయర్ అబ్బాస్ అఫ్రిదీ స్లో బాల్‌తో ఫిన్ అలెన్ (35; 15 బంతుల్లో) ను ఔట్ చేశాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. విలియమ్సన్ నిలకడగా ఆడితే మిచెల్ విజృంభించాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. మరోవైపు రెండు లైఫ్‌లు లభించిన విలియమ్సన్ 40 బంతుల్లో అర్ధశతకం సాధించి అబ్బాస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మరింత చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 13 ఓవర్లలోనే 150 మార్క్‌ను అందుకుంది. ఈ క్రమంలో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
అనంతరం కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన హారిస్ రవూఫ్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. అయితే ఫిలిప్స్ (19; 11 బంతుల్లో) చాప్‌మన్ (26; 11 బంతుల్లో), సౌథి (6*; 2 బంతుల్లో) తలో చేయి వేయడంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది చెరో మూడు వికెట్లు తీయగా, హారిస్ రవూప్ రెండు వికెట్లు తీశాడు.
అయితే ఇటీవల వేలంలో డారిల్ మిచెల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మినీ వేలంలో ఆరుగురు ప్లేయర్లను సొంతం చేసుకున్న చెన్నై మిచెల్‌కే అత్యధిక ధర వెచ్చింది. వన్డే వరల్డ్ కప్‌లో అతడి సత్తాను చూసి రూ.కోట్లు కుమ్మరించింది. అయితే ఇవాళ పాకిస్థాన్ మ్యాచ్‌లో మిచెల్ చెలరేగడంతో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మిచెల్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినా తప్పులేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చెన్నై కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ.8.40 కోట్లు), శార్దూల్ (రూ.4 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.1.80 కోట్లు), అవనీశ్ రావు (రూ.20 లక్షలు)