ధోనీ ఎంట్రీపై సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నా సీఎస్కే అభిమానులు మాత్రం తమ ఆరాధ్య దైవం ఎంఎస్ ధోనీ స్టేడియంలోకి ఎప్పుడు వస్తాడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలోనే పిక్క కండరాల గాయం బారిన పడిన ఎంఎస్ ధోనీ.. ఇప్పటివరకు సీఎస్కే ఆడిన 9 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఆడలేదు. అయితే తాజాగా ఆయన ఫిట్‌నెస్‌పై సీఎస్కే యాజమాన్యానికి చెందిన ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి కీలక విషయాలను వెల్లడించారు.
ధోనీ ప్రస్తుతం నెట్స్‌లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన పనిభారాన్ని పెంచుకుంటున్నారని జట్టు యాజమాన్యం పేర్కొంది. "ధోనీ తన రీ-ఎంట్రీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన శిక్షణపై పూర్తి దృష్టి సారించారు. అయితే ఆయన ఎప్పుడు మ్యాచ్ ఆడతారనేది మాత్రం ఎవరికీ తెలియదు. అది పూర్తిగా ధోనీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది" అని సీఎస్కే ప్రతినిధి స్పష్టం చేశారు. ఫ్రాంచైజీ యజమాన్యం కూడా ధోనీపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని.. ఆయన సిద్ధంగా ఉన్నానని చెబితేనే బరిలోకి దిగుతారని సమాచారం.

ఈ సీజన్‌లో ధోనీ లేకపోవడం సీఎస్కే ప్రదర్శనపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 9 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో ఆరో స్థానంలో ఉంది. ధోనీ లేని మిడిలార్డర్ తడబడుతుండటంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. జట్టుకు వెన్నెముకగా ఉండే ధోనీ గైర్హాజరీతో పాటు ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల పాలుకావడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది.
మే 5న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోనీ మైదానంలోకి అడుగుపెడతారో లేదో చూడాలి. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి 5 టైటిళ్లు అందించి, 10 సార్లు ఫైనల్ చేర్చిన ధోనీని ఈ సీజన్‌లో కనీసం ఒక్కసారైనా పసుపు రంగు జెర్సీలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మ్యాచ్ రోజు టాస్ సమయంలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications