CSK vs RR: స్పిన్నర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదనే విమర్శలను సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎదుర్కొంటున్నాడు. గౌహతి పిచ్ స్పిన్నర్లకు అద్భుతమైన మద్దతునిస్తుంది కాబట్టి.. రాజస్థాన్ రాయల్స్‌పై సీఎస్కే విజయం రుతురాజ్ గైక్వాడ్ చేతుల్లోనే ఉందని తెలుస్తోంది. అదే విధంగా రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు చేయాలని అభిమానులు సూచిస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో గౌహతిలోని బర్సపారా స్డేడియం వేదికగా నేడు(ఆదివారం) తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మ్యాచ్ రాజస్థాన్ సొంత మైదానంలో జరగుతున్నప్పటికీ పిచ్ పరిస్థితులు సీఎస్కేకు అనుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజాలను ఉపయోగించుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

బర్సపారా స్డేడియం పిచ్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 180 పరుగులు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సగటు స్కోరు 165 పరుగులు. అంటే మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ తర్వాత పిచ్ నెమ్మదిగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలి. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఎప్పటిలాగే ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించుతుందని భావిస్తున్నారు.
అయితే సీఎస్కే జట్టు విజయం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే గత సీజన్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే స్పిన్నర్ల ప్రతిభను పూర్తిగా వినియోగించుకోకుండా తప్పించుకుంటున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత మ్యాచ్ లో రుతురాజ్ మొత్తం 9 ఓవర్లు మాత్రమే స్పిన్నర్లతో వేయించాడు. ఈ క్రమంలో గౌహతి మైదానంలో ముగ్గురు స్పిన్నర్లతో 12 ఓవర్లు బౌలింగ్ చేయించాలని రుతురాజ్ గైక్వాడ్ కు సీఎస్కే ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా సీఎస్కే 5 సార్లు ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకోవడానికి ప్రధాన కారణం ఓపెనర్లు చాలా పరుగులు చేయడమేనని.. అందువల్ల కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా తిరిగి మైదానంలోకి వస్తే సీఎస్కే విజయం ఖాయమని పేర్కొంటున్నారు.