భీకర బ్యాటింగ్ లైనప్ సొంతమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పటిష్ఠ బౌలింగ్ దళం ఉన్న టీమ్స్‌యే కట్టడి చేయలేకపోయాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. బలహీన బౌలింగ్ టీమ్ అయినప్పటకీ పక్కా ప్రణాళికలతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆర్సీబీ చిత్తు చేసింది. సన్‌రైజర్స్ బలహీనతలను తెలుసుకుని ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
ఈ సీజన్‌లో చిన్నస్వామి వేదికగా అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 287 పరుగుల రికార్డు స్కోరును సాధించిన విషయం తెలిసిందే. ఛేదనలో బెంగళూరు గొప్పగా పోరాడినప్పటికీ అంతిమంగా ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. దీంతో నిన్న సొంతమైదానంలో ఉప్పల్‌లో ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రపంచ రికార్డులు నమోదుచేస్తుందేమోననే అంచనాలు పెరిగాయి. కానీ కట్ చేస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ప్రమాదకర బ్యాటర్లు అయిన ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ కోసం ఆర్సీబీ సిద్ధం చేసిన స్పిన్ ఉచ్చు సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో మూడు బంతుల్ని ఎదుర్కొన్న హెడ్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. క్లాసెన్ కూడా స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే హెడ్ బలహీనతను ఆర్సీబీ వెలుగులోకి తెచ్చి ఐపీఎల్‌లోని మిగిలిన జట్లకు ఊరటనిచ్చింది.
ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ 46 సగటు, 212 స్ట్రైక్‌రేటుతో 325 పరుగులు సాధించాడు. కానీ స్పిన్‌లో హెడ్ విజృంభించలేకపోతున్నాడు. 15 సగటు, 150 స్ట్రైక్‌రేటుతో 63 పరుగులే చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో మాత్రం 236 స్ట్రైక్‌రేటు, 87 సగటుతో 262 పరుగులతో సత్తాచాటుతున్నాడు. ఈ గణాంకాలను పరిశీలించిన ఆర్సీబీ రిస్క్ చేసింది. తొలి ఓవర్‌ను విల్ జాక్స్‌తో వేయించింది.
అయితే ఇది సత్ఫలితాన్ని ఇవ్వడంతో ఆదివారం చెపాక్ వేదికగా హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్‌ను ఆయుధంగా ఉపయోగించాలని భావిస్తోంది. తీక్షణతో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే మిడిల్ ఓవర్లలో జడేజాతో పాటు మొయిన్ అలీకి బంతిని అందివ్వాలని భావిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆర్సీబీ కట్టడిచేసిన తరహాలోనే సీఎస్కే చేయాలని ప్లాన్ చేస్తోంది.