
బంతిని చూసి షాట్లు ఆడానంతే:
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'ఇది కీలకమైన ఇన్నింగ్స్. ఢిల్లీ బౌలర్లు పెద్ద బౌండరీని బాగా ఉపయోగించుకున్నారు. ఈ మ్యాచ్‌లో నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. బంతిని చూసి షాట్లు ఆడానంతే. ఐపీఎల్ 2021లో నేను పెద్దగా రాణించలేదు. అందుకే ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా. బంతి ఎక్కడ పడుతుంది, బౌలర్ ఎలాంటి వేరియేషన్లతో వస్తున్నాడు అనేవి ఆలోచించి ఆడాను. అలా కాకుండా ఇతర విషయాలు గురించి ఆలోచిస్తే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేను. ఇక జట్టు ప్రదర్శన బాగుంది. అందరూ తమతమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లో కూడా బాగా ఆడుతామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.

ఉతప్ప టాప్ ఆర్డర్‌లో ఆడాలనుకుంటాడు:
'జట్టులో తొమ్మిదో స్థానంలో వచ్చే దీపక్ చహర్ వరకూ బ్యాటింగ్ చేయగలరు. ఇటీవలి కాలంలో శార్దూల్ ఠాకూర్‌తో పాటు దీపక్ కూడా బాగా ఆడుతున్నాడు. సహజంగా ఏ బ్యాటర్ అయినా క్రీజులోకి వెళ్లగానే.. తొలి బంతినే బౌండరీగా మలచడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తాడు. కానీ వీళ్లిద్దరూ (శార్దూల్, దీపక్) అలా కాదు. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయాలనుకుంటారు. వాళ్లు కనీసం ఒకటి, రెండు బౌండరీలు సాధించినా జట్టుకు ఉపయోగమే కదా. ఎందుకంటే ఇటీవలి కాలంలో జట్ల మధ్య 15-20 పరుగుల తేడానే ఉంటుంది. రాబిన్ ఉతప్ప టాప్ ఆర్డర్‌లో ఆడాలని ఆశిస్తాడు. అందుకే అతడిని ముందుగా పంపించాం. ఇంతకుముందు మొయిన్ అలీ మూడో స్థానంలో బాగా ఆడాడు. ఓపెనర్ ఔట్ అయిన సమయంలో మీ ఇద్దరిలో ఎవరిని పంపాలో అప్పుడే డిసైడ్ చేస్తామని చెప్పాము' అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.

రుతురాజ్ నైపుణ్యమున్న ఆటగాడు:
'రుతురాజ్ గక్వాడ్ 20 ఓవర్ల పాటు ఆడాలని అనుకుంటాడు. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ తర్వాత తనతో కలిసి మాట్లాడినప్పుడు.. 'ఓపెనర్‌గా నీకు శుభారంభం దక్కితే 10-12 ఓవర్లే బ్యాటింగ్ చేయాలనే నియమాలేవీ లేవు. వీలైతే 20 ఓవర్లపాటు క్రీజులో కొనసాగాలని చెప్పా'. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే ఆఖరి బంతి వరకూ ఉంది సెంచరీ చేశాడు. దీన్ని బట్టి రుతురాజ్ కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటాడని అర్థమవుతోంది. తన షాట్లు కూడా కచ్చితత్వంతో ఉంటాయి. ఎంతో నైపుణ్యమున్న ఆటగాడు. ఈరోజు కూడా బాగా ఆడాడు. మైదానం పెద్దది కావడం, మంచు ప్రభావం ఉండడంతో బౌండరీలు రావడం కష్టంగా మారాయి. ఈ విజయం జట్టు సమష్టి కృషి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడం బాధ కలిగించింది. అప్పుడు భావోద్వేగానికి కూడా గురయ్యా. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక ఫైనల్‌పై దృష్టిసారిస్తాం' అని చెన్నై కెప్టెన్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
