IPL 2021 Final: నిజమైన విజేత కోల్‌కతానే.. నా రిటైర్మెంట్ బీసీసీఐ మీదే ఆధారపడి ఉంది: ఎంఎస్ ధోనీ

దుబాయ్: ఐపీఎల్ 2021లో నిజమైన విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టే అని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. తొలి దశలో విఫలమయినా.. యూఏఈలో గొప్పగా పుంజుకుందన్నాడు. చెన్నై జట్టు నుంచి ఒక్కో ఆటగాడు మ్యాచ్ విన్నర్‌గా నిలవడం ఆనందంగా ఉందని ధోనీ చెప్పాడు. ఐపీఎల్-14 విజేతగా చెన్నై నిలిచిన విషయం తెలిసిందే. దుబాయి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతాను 27 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని కేకేఆర్ మూటగట్టుకుంది. సీఎస్‌కే ఈ విజయంతో నాలుగోసారి ట్రోఫిని సొంతం చేసుకుంది.

నిజమైన విజేత కోల్‌కతానే:
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'నేను చెన్నై గురించి మాట్లాడే ముందు కోల్‌కతా గురించి చెప్పాలి. మొదటి దశ తర్వాత కోల్‌కతా ఇంత గొప్పగా పుంజుకోవడం చాలా కష్టం. ఈ సంవత్సరం ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఏదైనా జట్టు అర్హత కలిగి ఉంటే.. అది కోల్‌కతా అని నేను భావిస్తున్నాను. వారికి కరోనా కారణంగా వచ్చిన విరామం కలిసొచ్చిందని భావిస్తున్నా. ఇక మా జట్టులో కొందరు ఆటగాళ్లను సందర్భానుసారంగా మార్చాల్సి వచ్చింది. ప్రతి మ్యాచ్ తర్వాత మాకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అర్ధమైంది. ఇక ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్నారు' అని అన్నాడు.

అభిమానులకు ధన్యవాదాలు:
'ఇన్నిసార్లు ఫైనల్ చేరడం ఎంతో ప్రత్యేకం. మాది నిలకడైన జట్టు అయినా గతంలో జరిగిన ఫైనల్ మ్యాచులలో ఓడిపోయాం. గణాంకాలు గమనిస్తే ఎక్కువసార్లు ఫైనల్లో ఓడింది మేమే అని తెలుస్తుంది. అందుకే ఎలాగైనా దానిని అధగమించి, కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రత్యర్ధులు మాపై ఆధిపత్యం చెలాయించొద్దనే మేము భావిస్తాం. జట్టు విజయాలు సాధించడానికి మేము పెద్దగా చర్చించుకోము. ఈసారి మా ప్లేయర్స్ బాగా ఆడారు. వారి ఆటతీరు బాగుంది. సరైన ఆటగాళ్లు జట్టులో లేకుంటే.. ఇలాంటి విజయాలు సాధ్యం కాదు. ఇక ఎలాంటి సమయంలో అయినా చెన్నై జట్టు వెంటే ఉండే అభిమానులకు ధన్యవాదాలు. ఎక్కడ ఆడినా మీరు ఇచ్చే మద్దతు అమోఘం. మీకు ఎంతో రుణపడి ఉంటాం. చెన్నై టైటిల్ గెలవడంతో అందరూ ఆనందంలో ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది' అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.

రిటెన్షన్ పాలసీపై ఆధారపడే:
'గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్ 2022లో నేను ఆడేది లేనిది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ముఖ్యం కాదు. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లను తయారు చేయడం చాలా ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం' అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications