
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మరి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌ను భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లతో పాటు హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా, చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా సోకడంతో లీగ్‌ను రద్దు చేయక తప్పలేదు. చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా వైరస్ బారిన పడ్డాడు. హస్సీకి రెండు సార్లు పాజిటివ్ రావడంతో.. ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నాడు. ఆపై ఇటీవలే మాల్దీవ్స్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.
ఇంటికి చేరుకున్న మైక్ హస్సీ తనకు కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని బయటపెట్టాడు. తాజాగా హస్సీ తన ఆరోగ్య పరిస్థితిపై ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్య్వూ తెలిపాడు. 'కరోనా నుంచి కోలుకున్నా ఇంకా శరీరం బలహీనంగానే ఉంది. మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. కరోనా సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే.. పాజిటివ్ రావడంతో కాస్తంత భయపడ్డా. ఆ సమయంలో బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. అప్పుడు కాస్త కుదుటపడ్డా' అని హస్సీ తెలిపాడు.
'బహుశా నాకు మా బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో నేను బాలాజీ పక్కనే కూర్చున్నా. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను. బహుశా అప్పుడు ట్రాన్స్‌మిషన్ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్ సిబ్బంది నన్ను రిసీవ్ చేసుకున్న విధానం బాగా నచ్చింది' అని మైక్ హస్సీ పేర్కొన్నాడు.
2004 నుంచి 2013 వరకు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ.. 79 టెస్టులు, 85 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. 79 టెస్టుల్లో 6235 పరుగులు, 185 వన్డేల్లో 5442 పరుగులు, 38 టీ20ల్లో 721 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ప్రాతినిధ్యం వహించిన హస్సీ.. 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం హస్సీ సీఎస్‌కేకు బ్యాటింగ్ కోచ్‌గా మారాడు.