
హైదరాబాద్: టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విమర్శలు వచ్చిన తరుణంలో ఊహించని రీతిలో ఓ రాజకీయ నాయకుడు నుంచి ధోనికి మద్దతు లభించింది. ఆ రాజకీయ నాయకుడు ఎవరని అనుకుంటున్నారా?
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. పదే పదే ఎందుకు ధోనీని లక్ష్యంగా చేసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. అంతేకాదు ధోని తెలివైన ఆటగాడు. క్రికెట్ అభివృద్ధి చెందడం కోసం ఎంతో పాటుపడిన అతడికి దేశం బాసటగా నిలవాలంటూ ట్వీట్ చేశాడు.
కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో దూకుడుగా ఆడటంలో ధోని విఫలమయ్యాడు. దీంతో టీ20ల నుంచి ధోని తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్, ఆకాశ్ చోప్రాలు ధోనిపై ప్రదర్శనపై విమర్శలు చేశారు.
అంతేకాదు టీ20ల నుంచి తప్పుకోవాలని ధోనికి సూచించారు. గత నాలుగు టీ20ల్లో ధోనీ వరుసగా 0*, 49, 7*, 13 పరుగులు చేశాడని, ధోనిని త్వరలో జరగబోయే శ్రీలంకతో జరగబోయే టీ20 సిరిస్ తప్పించాలంటూ ఆకాశ్ చోప్రా కాస్తంత ఘాటుగానే స్పందించాడు.
మరోవైపు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీకి మద్దతుగా నిలిచారు. కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీని విమర్శించే వాళ్లు... తమ కెరీర్‌ను ఓసారి పరిశీలించుకోవాలని రవిశాస్త్రి విమర్శించాడు.
'ధోనీని విమర్శించే వాళ్లు ఓసారి వెనక్కి తిరిగి తమ కెరీర్‌ను చూసుకోవాలి. ధోనీలో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉంది. ఓ దిగ్గజానికి మద్దతు ఇవ్వడం జట్టు బాధ్యత. నైపుణ్యం, ప్రదర్శనపై ప్రస్తుత జట్టు ఆధారపడిఉంది. ధోనీ కంటే మెరుగైన బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ లేడు. మైదానంలో అతని చురుకుదనం, సమయస్ఫూర్తి అమోఘం' అని రవిశాస్త్రి చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.