
హైదరాబాద్: భారత జట్టు ఓడిపోతే సంబరాలు చేసుకున్నారంటూ విమర్శకులపై రవిశాస్తి మండిపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. 'కొన్ని సార్లు నువ్వు ఓడినప్పుడు నీ వాళ్లే నవ్వుకుంటారు. అదే పెద్ద సమస్య. ఒకవేళ నువ్వు గెలిస్తే ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉంది, పేలవంగా ఆడిందంటూ విజయాన్ని గేళి చేస్తారు' అని రవిశాస్త్రి అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. 'భారత జట్టు ఓడినప్పుడు ఒక్కరూ కూడా జట్టు బాగా కష్టపడింది అనలేదు. అదే వేరే జట్టు ఓడిపోతే ఆ జట్టు ఉత్తమ ప్రదర్శన చూపించలేకపోయిందని అంటారు. ఏదైనా మనకు నచ్చితేనే ఆమోదిస్తాం. మేము దేశం కోసం ఆడుతున్నాం. జట్టు కోసమో, రికార్డుల కోసమో కాదు. ఆడుతుంది దక్షిణాఫ్రికాతో.. అంతే మాకు కావాల్సింది. ఆ జట్టులో ఎవరుంటే ఏంటి..?' అని ప్రశ్నించాడు.
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ దక్షిణాప్రికాతో తలపడి భారత్ వన్డే, టీ20లలో గెలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. ఈ విజయాన్ని 1974లో జరిగిన మొహమ్మద్ అలీ vs జార్జ్ ఫోర్‌మెన్ బాక్సింగ్ పోటీతో పోల్చి.. అలీ గెలిచిన విధంగా వాళ్లను గెలిచామని ఉద్ఘాటించాడు. దాంతోపాటుగా భారత జట్టుకు మ్యాచ్ షెడ్యూళ్లు తీవ్రమైన సమస్యగా మారాయనే విషయం ఒప్పుకున్నాడు.
'భారత్‌లో సగటు అభిమానికి మన జట్టే గెలవాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ, వాళ్లూ మనుషులే విశ్రాంతి లేకుండా పనిచేయడం కష్టం' అంటూ శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ప్లేయర్ల విశ్రాంతి గురించి ప్రస్తావించాడు.