
ఫారో: ఫుట్‌బాల్ లెజెండ్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రోనాల్డో నిలిచాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రోనాల్డ్.. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడంతో ఈ రికార్డు అందుకున్నాడు. రోనాల్డ్ ఖాతాలో ఇప్పుడు 111 అంతర్జాతీయ గోల్స్ ఉన్నాయి. దీంతో ఇరాన్ ఫుట్‌బాల్ ఆటగాడు అలీ డేయీ పేరిట ఉన్న 109 అంతర్జాతీయ గోల్స్ రికార్డును రోనాల్డో బ్రేక్ చేశాడు.
ఐర్లాండ్‌తో మ్యాచ్ జరగకముందు ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఇరాన్‌కు చెందిన అలీ డేయీ (109)తో సమానంగా క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ద్వారా అలీ డేయీ రికార్డును అతడు సమం చేశాడు. తాజాగా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడంతో అలీ డేయీ రికార్డును బద్దలు కొట్టాడు. 1993 నుంచి 2006 వరకు అలీ డేయీ ఇరాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటకీయంగా పోర్చుగల్ 2-1 తేడాతో విక్టరీ సాధించింది. క్రిస్టియానో రోనాల్డో రెండు గోల్స్ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో చేరిన రోనాల్డో.. తన సత్తాను మరోసారి చాటాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో.. 90 కన్నా ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్లలో అలీ డేయీ, రోనాల్డ్‌లు ఉన్నారు. మొఖ్తర్ దహరి (89), ఫెరెంక్ పుస్కేస్ (84), గాడ్‌ఫ్రే చిటాలు (79), హుస్సేన్ సయీద్ (78), పీలే (77) అలీ మబ్ఖౌట్ (76) వరుసగా ఉన్నారు. మరో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 76 బాదాడు.
ఆటలోనే కాదు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ క్రిస్టియానో రోనాల్డో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అత్యధిక ఇన్‌స్టా ఫాలోయర్లు కలిగిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. ఇన్‌స్టాలో తాను చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి రూ.11.92 కోట్లు అందుకుంటున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్, హాలీవుడ్ సూపర్‌స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత కరెన్సీ ప్రకారం వీరిద్దరూ ఒక్కో పోస్టుకు రూ.11.92 కోట్లు తీసుకుంటున్నారు. పాప్ సింగర్ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచింది. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.6 కోట్లు, బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ రూ 6.1 కోట్లు తీసుకుంటున్నారు.
ఇక యూరోకప్ 2020లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్ హోదాలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై రెండు కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. 'ఇలాంటివి వద్దు. మంచినీరు మాత్రమే తాగండి' అంటూ వాటర్ బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. దీంతో పెద్ద వివాదమే జరిగింది. రొనాల్డో దెబ్బకి కోకాకోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అయితే 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకాకోలా బ్రాండ్‌కు యాడ్ చేయడం విశేషం.