హైదరాబాద్: క్రికెట్ అంటే కేవలం ప్రదర్శన మాత్రమేనని టీమిండియా ఇండియా ఏ, అండర్-19 జట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బెంగళూరులో ఆదివారం జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రముఖ జర్నలిస్ట్‌లు రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రేమ్ పానికర్‌లతో రాహుల్ ద్రవిడ్ ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.
ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఒంటి మీద టాటూలు వేసుకోని వారు కూడా మ్యాచ్‌లు గెలిపిస్తారని, గేమ్ అంటే కేవలం ప్రదర్శన మాత్రమేనని వ్యాఖ్యానించాడు. రాక్‌స్టార్ లాగా కనిపించినంత మాత్రాన మ్యాచ్‌లు గేలవలేమని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.

అంతేకాదు సిరిస్‌లకు ముందు కొన్ని సార్లు విరాట్ కోహ్లీ చేసే కామెంట్స్ తనను ఎంతగానో భయపెడతాని ద్రవిడ్ అన్నాడు. ఇలాగా మాట్లాడితేనే, మైదానంలో దూకుడుగా ఉంటేనే తనలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని కోహ్లీ కావాలనే అలా చేస్తున్నాడేమోనని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఇక, మైదానంలో స్లెడ్జింగ్ చేసే వాళ్లు, దూకుడుగా ఆడే వాళ్లు కూడా అవసరమేనని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే కొత్త తరం క్రికెటర్లు మాత్రం గుడ్డిగా విరాట్ కోహ్లీని ఫాలో కావద్దని రాహుల్ ద్రవిడ్ ఈ సందర్భంగా హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో రాజ్ దీప్ సర్దేశాయ్ కొన్ని ఆసక్తికర ప్రశ్నలను సైతం ద్రవిడ్‌ని అడిగాడు.
ముఖ్యంగా గేమ్ కంటే విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలకు పేరు రావడం, టీమిండియా ప్రధాన కోచ్‌లను నిర్ణయించే అధికారాలపై కూడా రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లేని అవమానకర రీతిలో సాగనంపడంపై ద్రవిడ్ స్పందించాడు.
'కుంబ్లేలాంటి లెజెండ్‌ను అలా పంపించడం దురదృష్టకరం. అదే సమయంలో కోచ్‌లపై ఇలా వేటు వేయడం సాధారణమే. నేను కూడా అండర్ 19 కోచ్‌గా ఉన్నాను. నా పైనా వేటు వేయొచ్చు' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ధోని రిటైర్మెంట్‌పై కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా స్పందించాడు.
'ధోని రిటైర్మెంట్‌పై విభిన్న అభిప్రాయలపై ఉన్నారు. ఇక సెలక్టర్లు టీమ్‌లోకి ఎంపిక చేసినంత వరకు ధోనీ ఇండియాకు ఆడొచ్చు. రిటైర్మెంట్ అతని ఇష్టం' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కొత్తతరం క్రికెటర్లు చిన్న చిన్న పట్టణాల నుంచి రావడంపై కూడా రాహుల్ స్పందించాడు. ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ పూర్తిగా మారిపోయిందని ద్రవిడ్ అన్నాడు.