హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావును టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన వీవీఎస్, మంత్రి కేటీఆర్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు.
హైదరాబాద్‌లో క్రీడల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన, తాను త్వరలో ప్రారంభించనున్న క్రికెట్ అకాడమీకి సంబంధించిన అంశాలను మంత్రికి కేటీఆర్‌కు లక్ష్మణ్ వివరించారు. తెలంగాణ యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా కృషి చేస్తున్నామని, ఇలాంటి అకాడమీలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో పాటు హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం హెచ్‌సీఏ సిబ్బంది సమ్మె కారణంగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్)కు తరలించే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కూడా లక్ష్మణ్ ట్వీట్ చేశారు. కేటీఆర్ డైనమిజం, విజన్, ఎనర్జీ తనను అమితంగా ఆకట్టుకున్నట్లు లక్ష్మణ్ అందులో రాసుకొచ్చారు.