

కోల్‌కతా: సోషల్ మీడియాలో ఎప్పుడూ వైవిధ్యంగా స్పందిస్తూ.. ట్రెండింగ్‌లో ఉండే గౌతం గంభీర్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. రక్షాబంధన్ పురస్కరించుకొని కోల్‌కతా నగరంలో రాఖీలను వినూత్నంగా కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే దిశగా యత్నించాడు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు.
రాఖీ పండుగంటే మగ.. ఆడ అనే విషయాలపై ఆధారపడి ఉండదు. ఇది ఒక మానవత్వానికి నిదర్శనం. మనిషిగా గర్వపడుతున్నా.. ట్రాన్స్‌జెండర్స్ అయినటువంటి అభీనా అహెర్.. సిమ్రాన్ షేక్‌లు నాకు రాఖీ కట్టారు. దానిని నేను ప్రేమతో స్వీకరించాను. మరి మీ సంగతేంటి. అని ట్వీట్ చేసి తన ఔన్నత్యాన్ని చాటాడు. దీంతో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త ట్వీట్‌తో ట్రెండీగా నిలిచాడు.
సామాజిక స్పృహతో స్పందించినా.. రాజకీయాల్లోకి రానున్న గౌతం గంభీర్‌కు ఈ హిజ్రాలతో సహవాసం కూడా పనికొచ్చేట్లుంది. గంభీర రాజకీయ అరంగ్రేటంపై ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "నోట్ల రద్దు, జీఎస్టీ, అక్రమ కట్టడాల తొలగింపునకు అనుమతులు ఇవ్వడంతో స్థానిక బీజేపీ నాయకులపై ఢిల్లీ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ప్రభావం ప్రధాని మోడీపై ఏమాత్రం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది" అని అన్నాడు.
ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం జట్టులోని యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. తనను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని ఎవరూ బలవంతం చేయలేదని ఒత్తిడి కారణంగానే సారథ్యానికి దూరమవుతున్నానని గంభీర్ వెల్లడించాడు.