
హైదరాబాద్: క్రిస్టమస్ సందర్భంగా క్రికెటర్లు తమ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంటా క్లాస్ టోపీలు ధరించి సోషల్ మీడియాలో ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. పలువురు క్రికెటర్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు.
కాగా, క్రిస్టమస్ వేడుకలకు ముందే అభిమానులకు టీమిండియా మంచి బహుమతిని ఇచ్చింది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ముంబైలోని వాంఖడె వేదికగా జరిగిన చివరి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం జరిగే ప్రజెంటేషన్ కార్యక్రమ సమయంలో క్రికెటర్లు తలకు శాంటా క్లాజ్ టోపీలు పెట్టుకుని మైదానంలో సందడి చేశారు. ధోని ధరించిన శాంటా క్లాజ్ ట్రోఫీ మిగతా ఆటగాళ్లతో పోలిస్తే కాస్తంత భిన్నంగా ఉంది. ధోనీ పెట్టుకున్న టోపీకి ఓ మీసం, గెడ్డం, కళ్లు, ముక్కు ఉన్నాయి.
ఆ టోపిని ధరించిన అనంతరం ధోని తెగ మురిసిపోయాడు. తన తలను అటు ఇటు తిప్పుతూ శాంటా లాగే ధోని కాసేపు ప్రవర్తించాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ అయితే ఆ టోపీకి ఉన్న గెడ్డంతో ధోనిని ఆటపట్టించడం విశేషం. ధోని శాంటా క్లాజ్ ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.