ముంబై: మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం మృతి పట్ల క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా క్రీడాకారులు నివాళులర్పించారు. 'అబ్దుల్ కలాం లాంటి ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయిన దేశం రోదిస్తోంది.. ఆయనో గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాక, గొప్ప మనిషి' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెదూల్కర్ పేర్కొన్నాడు.
దేశం ఓ గొప్ప మార్గదర్శిని కోల్పోయిందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. 'దేశానికి బాధాకరమైన రోజిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్వీట్ చేసింది. 'మీరు అందరి హృదయాలను గెలిచారు సార్.. మీ మరణం భారత జాతికి తీరని లోటు' అని బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల పేర్కొంది.

'ఆయన ప్రజల రాష్ట్రపతి. ఆయన చేసిన సేవలు మేధావులకు, శాస్త్రవేత్తలకు, నాయకులకు స్ఫూర్తినిస్తాయి' అని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ ట్వీట్ చేశాడు. ఫార్ములావన్ స్టార్ కరణ్ చందోక్, టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, భారత మాజీ స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడి, శ్రీశాంత్, తదితర క్రీడాకారులు కలాంకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.
సోమవారం సాయంత్రం షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ కలాం కన్నుమూశారు.