
అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం మానియా అందరినీ ఊపేస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం అందుకోవడంతోపాటు అభిమానుల మనసులు కూడా దోచుకుంది. అలాగే అందులోని పాటలు, అల్లు అర్జున్ నటన, డ్యాన్సులు, డైలాగ్‌లు అభిమానులకు బాగా ఎక్కేశాయి. దీంతో ఇప్పటికే పుష్ప సినిమా చూసి అనేక మంది క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పుష్ప చిత్రంలోని డైలాగులు, పాటలు, డ్యాన్స్‌లను అనుసరిస్తూ పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సోషల్ మీడియలో వీడియాలు పోస్ట్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాటర్ సురేష్ రైనా కూడా చేరాడు. ఇటీవల పుష్ప సినిమా చూసిన రైనా.. అందులోని శ్రీవల్లి పాటకు పుష్ప రాజ్‌గా స్టెప్పులేసి అదరగొట్టాడు. అచ్చం అల్లు అర్జున్ మాదిరిగానే స్టెప్పులేశాడు. అల్లు అర్జున్ మాదిరిగానే పాద రక్షలను, కళ్లజోడు ధరించి ఆకట్టుకున్నాడు. ఈ వీడియాలో రైనాతోపాటు మరో ఇద్దరు కూడా స్టెప్పులేయడం గమనించవచ్చు.
ఈ వీడియోను సురేష్ రైనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై రైనా ప్రశంసలు కురిపించాడు. పుష్ప సినిమాను చూశానని, అల్లు అర్జున్ నటన బాగుందని కొనియాడాడు. అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నాడు. అలాగే నీ శ్రీవల్లి పాటను ఏదో అలా ప్రయత్నించానని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం సురేష్ రైనా చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇదే పాటకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా ఈ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప డైలాగ్‌ను డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా చెప్పి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనా పాల్గొననున్నాడు. ఐపీఎల్‌లో సురేష్ రైనా ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. కానీ ఈ సారి చెన్నై రిటెన్షన్ జాబితాలో రైనాకు చోటు దక్కలేదు. అయితే వేలంలో రైనాను మళ్లీ చెన్నై సూపర్ కింగ్సే దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 136 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 506 ఫోర్లు, 203 సిక్స్‌లు బాదాడు.