అంతర్జాతీయ క్రికెట్‌లో.. జట్టులో చోటు కోల్పోడం లేదా ఇతర కారణాల వల్ల కొంత కాలం పాటు ఆటకు దూరమై.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే ప్లేయర్లు చూస్తుంటాం. లేదంటే ఒక మ్యాచు ఆడి మరో మ్యాచుకు.. మహా అయితే రోజుల వ్యవధి నుంచి కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకునే ఆటగాళ్లను చూసుంటాం. కానీ ఓ ఆటగాడు మాత్రం ఏకంగా 17 ఏళ్ల 73 రోజుల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తన కెరీర్ లో మొదటి టీ20 మ్యాచు ఆడాక.. రెండో టీ20 మ్యాచు ఆడటానికి అతడికి ఏకంగా 17 ఏళ్ల రెండున్నార నెలల సమయం పట్టింది. తాజాగానే అతడు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచు ఆడాడు. ఇంతకీ అతడెవడంటే?
ప్రస్తుతం జార్జ్ టౌన్‌లో నార్త్ అమెరికన్ కప్ జరుగుతోంది. ఈ టీ20 టోర్నమెంటులో యూఎస్, కెనడా, బెర్ముడా, బహమాస్ జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీలోనే ఆడుతోన్న బహమాస్ కు చెందిన ఆల్ రౌండర్ రియాన్ తప్పిన్ (Ryan Tappin) అనే ఆటగాడు.. తన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచును 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు (ఏప్రిల్ 20) ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్ లు జరుగుతోన్న అతడు మాత్రం ఏ మ్యాచులు ఆడలేదని తెలిసింది.
అప్పుడు 22.. ఇప్పుడు 39..
రియాన్ తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచును 2008లో ఫిబ్రవరి 6న ఆడాడు. జమైకా జట్టుపై టీ20 అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచులో అతడు 25 పరుగులు చేశాడు. ఓ వికెట్ తీశాడు. అనంరం 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన రెండో టీ20 మ్యాచును యునైటెడ్ స్టేట్స్ పై ఆడే అవకాశం వచ్చింది. కానీ అతడు ఈ మ్యాచులో నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఏదేమైనా అత్యంత ఎక్కువ కాలం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తన డెబ్యూ మ్యాచ్ ఆడేటప్పుడు రియాన్ తప్పిన్ వయసు 22 ఏళ్ల 36 రోజులు. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ సమయంలో 39 ఏళ్ల 115 రోజులు అతడి వయసు.

వీళ్లు కూడా ఎన్నో ఏళ్ల పాటు గ్యాప్ ఇచ్చి..
అంతకుముందు బహమాస్ కు చెందిన Dwight Weekley అనే క్రికెటర్ పేరిట ఈ రికార్డు ఉండేది. అతడు అంతర్జాతీయ టీ20ల్లో 16 ఏళ్ల 304 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. Cayman Islandsకు చెందిన జెలాన్ లింటన్ తన టీ20 రీఎంట్రీ 15 ఏళ్ల 262 రోజుల తర్వాత ఇచ్చాడు. బహమాస్ కు చెందిన నరేంద్ర ఎకానాయక్ 14 ఏళ్ల 316 రోజుల తర్వాత మళ్లీ టీ20 మ్యాచును ఆడాడు. అలానే యూఏఈకు చెందిన ఆసిఫ్ ఖాన్ కూడా 14 ఏళ్ల 316 రోజులు గ్యాప్ తీసుకుని టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.