సిడ్నీ: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్(25) మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తలకు క్రికెట్ బంతి తగిలి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన హ్యూస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతని కోసం అభిమానులు చేసిన ప్రార్థనలు వృథా అయ్యాయి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Lc6n1mxTy90?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఆసీస్ ఓపెనర్ అయిన ఫిలిప్ హ్యూస్ మూడు రోజుల క్రితం జరిగిన దేశావలీ మ్యాచులో న్యూ సౌత్ వేల్స్ బౌలర్ షాన్ అబోట్ వేసిన బంతికి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన హ్యూస్ మరణించాడని గురువారం ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. కాగా, ఫిలిప్ హ్యూస్‌కు బౌలింగ్ వేసిన షాన్ అబోట్ అతనికి మంచి స్నేహితుడు.
ఇది ఇలా ఉండగా ఫిలిప్ హ్యూస్ హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం బ్యాట్స్‌మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, లండన్‌కు చెందిన ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీ సంస్ధ 'మాసురి' స్పందించింది.

హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని స్పష్టం చేసింది. కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి.
ఫిలిప్ హ్యూస్‌ది ఒడుదుడుకుల కెరీరే కావొచ్చుగానీ, అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్రవేశాడు. అత్యంత పిన్నవయస్సు (19 ఏండ్లు)లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు హ్యూస్ పేరిటే ఉంది. 2009లో దక్షిణాఫ్రికాపై డర్బన్ టెస్టులో స్టెయిన్, మోర్కెల్‌ల బౌలింగ్‌కు ఎదురొడ్డి ఓపెనర్‌గా 115, 160 స్కోర్లు చేశాడు. ఇది అతనికి కెరీర్‌లో రెండో టెస్ట్.
కెరీర్‌లో తొలి వన్డేలోనే (2013లో శ్రీలంకపై 112) సెంచరీ కొట్టాడు. గతేడాది ఇంగ్లండ్‌పై (నాటింగ్‌హామ్ టెస్ట్) ఏగర్‌తో కలిసి 163 పరుగులు జోడించి, టెస్టు క్రికెట్లోనే పదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన హ్యూస్ మరణం క్రికెటర్లతో పాటు ఆయన అభిమానుల్లో విషాదం నింపింది.
పాక్-కివీస్ మూడో టెస్ట్ రెండో రోజు రద్దు
ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ మృతికి సంతాపంగా పాకిస్థాన్-న్యూజిలాండ్ మూడో టెస్ట్ రెండో రోజు ఆట రద్దయింది. హ్యూస్ మృతిపై భారత క్రికెటర్లు సురేష్ రైనా, రోహిత్ శర్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆసీస్-భారత్ తొలి టెస్ట్ వాయిదాపై బోర్డులు నిర్ణయం తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అన్నారు. ఆటగాళ్లు మ్యాచుకు సన్నద్ధమయ్యే పరిస్థితి కనిపించట్లేదని అన్నారు.