హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి తాను కెప్టెన్ కూల్ అని నిరూపించుకుంది. తన శరీరాన్ని అవహేళన చేస్తూ ఓ తుంటరి చేసిన ట్వీట్‌కు మిథాలీ రాజ్ తనదైన శైలిలో బదులిచ్చింది. అసలేం జరిగిందంటే...
ఓ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరైన మిథాలీ రాజ్ తన సహచర క్రికెటర్లు అయిన మమతా మాబెన్, నూషిన్ ఆల్ ఖాదీర్, వేదా కృష్ణమూర్తితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా 'ప్రత్యేకమైన మహిళలతో కలిసి ఉన్నాను. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు' అని ఈ ఫోటోకి కామెంట్ పోస్టు చేసింది. మిథాలీ పోస్టు చేసిన కొద్ది సేపటికే ఆషిమ్ దాస్ చౌదరి అనే నెటిజన్ 'స్వారీ కెప్టెన్, హాహాహా చెమట వల్ల చూడడానికి ఇబ్బందిగా ఉంది' అని రిప్లై ఇచ్చాడు.
దీంతో ఆషిమ్ దాస్ చౌదరి ఇచ్చిన సమాధానం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతడి చేసిన కామెంట్‌కు 'ఫీల్డ్‌లో ఉండటం వల్లే చెమట పట్టింది. సిగ్గు పడేందుకు నాకు ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే నేను క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాను' అని మిథాలీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
మిథాలీ ఇచ్చిన సమాధానం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మిథాలీ సాధించిన రికార్డులపైన కాకుండా ఆమె శరీరంపై దృష్టి సారించిన ఆషిమ్ దాస్ చౌదరి తీరుపై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన మహిళల వరల్డ్ కప్ తర్వాత ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న కెప్టెన్ మిథాలీ రాజ్ త్వరలోనే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది. భారత్‌లో మహిళా క్రికెటర్లకి ఇంతటి ఆదరణ ఊహించలేదని, ప్రస్తుతం జట్టుపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో 2018 టీ20 వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మిథాలీ రాజ్ వెల్లడించింది.
'నేను క్రికెట్ నేర్చుకోవడం ఆరంభించినప్పటి నుంచి దేశంలో మహిళల క్రికెట్ ఎదుగుదలని పరిశీలించాను. మరింత మంది యువతులు క్రికెట్‌లోకి రావాలి. నేను మా నాన్నతో ఎప్పుడూ చెప్తుంటాను. భారత్ జట్టు బలంగా ఉన్నప్పుడు నేను పక్కకి వైదొలుగుతాను.. అంతేగానీ బలహీనంగా వదిలేయను అని' అని పేర్కొంది.
'ప్రస్తుతం నా దృష్టి అంతా 2018 టీ20 ప్రపంచకప్ గెలవడంపైనే ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మా జట్టుపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి.. సీనియర్ బ్యాటర్, కెప్టెన్‌గా నాపైనా బాధ్యతలు కూడా రెట్టింపయ్యాయి' అని మిథాలీ రాజ్ వెల్లడించింది.