అహ్మదాబాద్: టెస్టుల్లో ఆరంగ్రేట మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేసిన మొట్ట మొదటి భారత క్రికెటర్ దీపక్ శోధన్ మృతి చెందారు. 1952లో పాకిస్థాన్ తో ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టారు శోధన్. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ ను తన శతకం ద్వారా గట్టెక్కించాడు శోధన్.

తన ఇన్నింగ్స్ లో మొత్తం 15 ఫోర్లతో సెంచరీని నమోదు చేసిన శోధన్.. టెయిలెండర్ దత్తుతో కలిసి 86 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. దీంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసి భారత్ కు ఓటమి తప్పింది. 1953లో వెస్టిండీస్ భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ శోధన్ కు ఆఖరిది. ఎడమచేతి వాటం గల ఈ ఆల్ రౌండర్ దేశవాళీ క్రికెట్ లోను తనదైన మార్క్ వేశాడు. దేశవాళీల్లో బరోడా, గుజరాత్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు శోధన్.