
హైదరాబాద్: గేల్ మొదలెట్టేశాడు. ఆటకి విరామం చెప్పి విరామంలో ఎంజాయ్ చెయ్యాలంటూ కేరళ వెళ్లి సరదాగా గడిపేస్తున్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ సారి కుటుంబంతో సహా విడిదికి బయల్దేరాడు. క్రిస్ గేల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఆదివారం వరకూ కేరళలోనే ఉన్నాం. మరికొద్ది రోజుల వరకూ ఇక్కడే ఉండొచ్చు అని తెలిపాడు. ఏప్రిల్ 23వ తేదీ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఆడిన మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గేల్ పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ అనంతరం ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడడానికి కారణం అని అడిగిన ప్రశ్నకు యోగా చేయడమేనని చెప్పుకొచ్చాడు గేల్. ఈ నేపథ్యంలోనే అతను విడిదికి వచ్చిన హోటల్ పక్కనే యోగా తరగతుల్లో సైతం పాల్గొంటున్నాడట. దాంతో పాటు కేరళలో దొరికే ప్రత్యేక వంటలను కుమ్మేస్తున్నాడట. విరామం అనంతరం మే 3వ తేదీ నుంచి మళ్లీ ఐపీఎల్ శిక్షణలో పాల్గొంటాడు. మే4న జరగనున్న మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ఇండోర్ బయల్దేరనున్నాడు.
అతని ఫిట్ నెస్ గురించి స్పందించిన క్రిస్ గేల్ ...'పెద్ద కష్టమైన పనేం కాదు. శరీరాన్ని మంచి షేప్‌లో ఉంచుకోవాలి. దాదాపుగా సహజంగానే నా శరీరం మంచి షేప్ లో ఉంటుందనుకోండి(నవ్వుతూ). అయినా దీని కోసం ఆహార అలవాట్లు మార్చుకుంటాను. స్ప్రింగ్ చికెన్ ఎక్కువగా తీసుకోను. అనుభవాన్నంతా ఉపయోగించి ఆటతీరు మరింత మెరుగ్గా ప్రదర్శనిచ్చేందుకు కష్టపడతాను.'
తర్వాత ఏం చేయబోతున్నారని అడిగిన ప్రశ్నకు 'ప్రస్తుతం నా ముందున్నది కేవలం రికార్డులే కాదు. ఐపీఎల్ ట్రోఫీ, ఇంకా వచ్చే ఏడాది రానున్న వరల్డ్ కప్. ఐపీఎల్ 11సీజన్ కు పంజాబ్ జట్టు విజేత కావాలి. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ లో వెస్టిండీస్ విజేతగా నిలవాలి. నాకు తెలుసు వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లేందుకు మేము క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కప్ గెలుచుకోవాలిన గట్టి పట్టుదలతో ఉన్నాం.'