రాజ్‌కోట్: ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ వేసిన బంతిని రక్షణాత్మక ధోరణిలో ఆడబోయిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విచిత్రమైన పద్ధతిలో ఔటయ్యాడు. వికెట్‌కీపర్‌కు స్టంపింగ్ అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఎడమకాలును క్రీజ్‌లోకి పారజాపాడు. అయితే, కాలు స్టంప్స్‌కు తగలడంతో బెయిల్ కిందపడింది. అతను హిట్ వికెట్‌గా అవుటయ్యాడు.
టెస్టుల్లో భారత కెప్టెన్ హిట్ వికెట్‌గా వెనుదిరగడం 65 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1949లో ట్రెవర్ గోడార్డ్ నాయకత్వంలో వచ్చిన వెస్టిండీస్ జట్టుతో చెన్నైలో జరిగిన టెస్టులో అప్పటి భారత కెప్టెన్ లాలా అమర్‌నాథ్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జాన్ ట్రిమ్ బౌలింగ్‌లో ఇదే విధంగా హిట్ వికెట్ అయ్యాడు.

కాగా, భారత క్రికెటర్లు హిట్ వికెట్‌గా అవుట్‌కావడం ఇది 22వసారి. లాలా అమర్‌నాథ్ కుమారుడు మొహీందర్ అమర్‌నాథ్ ఏకంగా మూడు పర్యాయాలు హిట్‌వికెటయ్యాడు. 2002లో వెస్టిండీస్‌తో జరిగిన సెయింట్ జాన్స్‌లో జరిగిన టెస్టులో వివిఎస్ లక్ష్మణ్ తర్వాత, భారత బ్యాట్స్‌మన్ హిట్ వికెట్‌గా వెనక్కు వెళ్లడం ఇదే తొలిసారి.
హమీద్ రికార్డు
కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టులోనే ఈ మైలురాయిని దాటిన 20 ఏళ్లలోపు బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడోవాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
1906లో జాక్ క్రాఫోర్డ్, 1937లో డెనిస్ కాంప్టన్ 20 ఏళ్లలోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తమతమ మొదటి టెస్టులో హాఫ్ సెంచరీలు సాధించారు. 79 సంవత్సరాల విరామం తర్వాత హమీద్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
విదేశీ జట్టుకు ఇదే తొలిసారి
భారత్‌లో ఒక విదేశీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడం 2012 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు కూడా ఇంగ్లాండ్ జట్టే నాగపూర్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లీడ్‌ను సాధించింది. ఆతర్వాత 13 టెస్టుల్లో భారత్ సగటున 155 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది.
ఇంగ్లాండ్‌పై అశ్విన్ 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది ఐదోసారి. మరే ఇతర జట్టుపైనా అతను ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు. వెస్టిండీస్‌పై నాలుగు పర్యాయాలు 40 లేదా అంత కన్నా ఎక్కువ పరుగులు చేశాడు.