న్యూయార్క్: క్రికెట్ ఆల్ స్టార్స్ సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మంచి రసవత్తరంగా సాగింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్ విజయం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులతో చెలరేగిపోయాడు.
అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో సచిన్ బ్లాస్టర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. సచిన్ టెండూల్కర్ 26, జయవర్ధనే 18, హూపర్ 11, పొలాక్ 11 పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ 8 పరుగులు చేయగా... షేన్‌వార్న్ 3, సైమండ్స్ 3 వికెట్లు పడగొట్టారు. షేన్‌వార్న్ బౌలింగ్‌లోనే సచిన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వార్న్ వారియర్స్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.
రికీ పాంటింగ్(48), సంగక్కర(41), జాంటీ రోడ్స్(20) రాణిచండంతో వారియర్స్ విజయం సాధించింది. సచిన్ బ్లాస్టర్స్ బౌలర్ షోయబ్ అక్తర్ 2 వికెట్లు తీయగా... మురళీ ధరన్ ఒక వికెట్ తీశాడు. షేన్ వార్న్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మిగతా రెండు మ్యాచ్‌లు ఈ నెల 11, 14న జరుగనున్నాయి. బేస్‌బాల్ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా డ్రాప్‌ఇన్ పిచ్‌లను సిద్ధం చేశారు. సచిన్, వార్న్ కెప్టెన్లుగా మొత్తం 27 మంది లెజెండరీ క్రికెటర్లు రెండు జట్లుగా విడిపోయి తొలి ట్వంటీ20లో తలపడ్డారు.
జట్ల వివరాలు:
సచిన్ బ్లాస్టర్స్:
సెహ్వాగ్, లక్ష్మణ్, లారా, గంగూలీ, జయవర్దనే, కార్ల్ హూపర్, మొయిన్‌ఖాన్, మురళీధరన్, గ్రేమ్‌స్వాన్, షాన్ పొల్లాక్, అంబ్రోస్, మెక్‌గ్రాత్, క్లూసెనర్, షోయబ్ అక్తర్.
వార్న్ వారియర్స్:
మాథ్యూ హెడెన్, మైఖేల్ వాన్, రికీ పాంటింగ్, జాంటీ రోడ్స్, కలిస్, సిమండ్స్, సంగక్కర, సక్లయిన్ ముస్తాక్, వెటోరి, వాల్ష్, వసీం అక్రమ్, డొనాల్డ్, అజిత్ అగార్కర్.