
ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులకు ఆటగాళ్లు ఆటోగ్రాఫ్‌లపై సంతకాలు పెట్టడాన్ని నిషేధించింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆటగాళ్లు అభిమానులకు దూరంగా ఉంటూ సామాజిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. ఈ నిషేధం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్, యాషెస్ సిరీస్‌లోని ఆటగాళ్లకు వర్తిస్తుంది. అయితే ఈ నిషేధం న్యూ సౌత్ వేల్స్ , విక్టోరియాలో ప్రాంతాల్లోనే ఉండనుంది. అక్కడ అత్యధికంగా కరోనా కేసులు నమోదవడమే ఇందుకు కారణం. కాగా విక్టోరియాలో కొత్తగా 1,504 కరోనా కేసులు నమోదుకాగా, న్యూసౌత్ వేల్స్‌లో 2,482 కరోనా కేసులు నమోదయ్యాయి.
అందుకే ఆటోగ్రాఫ్‌లపై సంతకాలు నిషేధం
కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ హెచ్చరించాడు. యాషెస్ సిరీస్, బిగ్‌బాష్ లీగ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కొంతమంది ఆటగాళ్లు అభిమానుల ఆటోగ్రాఫ్‌లపై సంతకాలు పెట్టడం, వాళ్లతో ముచ్చటించడం కనిపించిందని ఆయన తెలిపారు. ఇది ఆటగాళ్ల ఆరోగ్యరీత్యా మంచిది కాదన్న ఆయన.. వాళ్లు సురక్షితంగా ఉండాలని ఆకాక్షించారు. అందుకే ఆటోగ్రాఫ్‌లపై ఆటగాళ్లు సంతకాలు చేయడాన్ని నిషేధించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. అంతేకాకుండా యాషెస్ సిరీస్‌లో భాగంగా జరగనున్న మిగతా టెస్టులకు ఆటగాళ్లకు ప్రోటోకాల్ అమలవుతుందని ఆయన చెప్పారు. మిగతా టెస్టు మ్యాచ్‌లు మెల్‌బోర్న్, సిడ్నీలో జరగనున్నాయి. ఆస్ల్రేలియా ఆటగాళ్లు కుటుంబంతో గడపడానికి ఇంటికి వెళ్తే మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకున్నాకే జట్టుతో కలుస్తారని తెలిపారు.
బాక్సింగ్ డే టెస్ట్‌కు అందుబాటులో కమిన్స్
అయితే ఆడిలైడ్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు కొన్ని గంటల ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హోటల్ గదిలో కమిన్స్ కరోనా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో అతను రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. మైఖేల్ నెస్సర్ అడిలైడ్ టెస్టులో కమ్మిన్స్ స్థానంలో ఆడుతున్నాడు. ప్రస్తుతం కమిన్స్ క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే టెస్టుల్లో కమిన్స్‌కు కరోనా నెగేటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం వారం రోజుల క్వారంటైన్‌లో ఉన్న కమిన్స్ బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.