
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం జరుగుతున్న పోలింగ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోమవారం తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బాంద్రా వెస్ట్‌లోని ఓ పోలింగ్ సెంటర్‌లో సచిన్ టెండూల్కర్ ఓటు వేశారు. సచిన్ భార్య అంజలి, కుమారుడు అర్జున్ కూడా అతడితో పాటు కలిసి వచ్చి ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం సచిన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు ముంబైలో పలువురు బాలీవుడ్ సెలబ్రటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రీతీజింతా, సుభాష్ ఘాయ్, వరుణ్ ధావన్, గోవిందా, జాన్ అబ్రహాం, ఖైలాష్ ఖేర్, దియా మీర్జాలు బాంద్రాలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఆయన భార్య రేష్మి బాంద్రా ఈస్ట్‌లో ఓటు వేశారు. ఆదిత్య, తేజస్ థాకరేలు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రే బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లీ ముంబై నుంచి ఆదిత్య థాకరే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోమవారం మహారాష్ట్రతో పాటు హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి కూడా పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145.