క్రికెట్ ప్రపంచంలో రషీద్ ఖాన్, లసిత్ మలింగ వంటి దిగ్గజ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును ఇండోనేషియాకు చెందిన గేడే ప్రియందానా నెలకొల్పాడు. కేవలం ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టి టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు.
ఒక ఓవర్.. ఒక రన్.. 5 వికెట్లు!
బాలీలో కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో 28 ఏళ్ల పార్ట్-టైమ్ మీడియం పేసర్ గేడే ప్రియందానా ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రియందానా రికార్డు సృష్టించాడు. ఓవర్ మొదటి 3 బంతుల్లో వరుసగా ముగ్గురు బ్యాటర్లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఓవర్లో వచ్చిన ఏకైక పరుగు కేవలం ఒక వైడ్ ద్వారా మాత్రమే వచ్చింది. ఓవర్ చివరి రెండు బంతుల్లో మరో ఇద్దరిని ఔట్ చేసి, మొత్తం ఒకే ఓవర్లో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

మలింగ, రషీద్ ఖాన్ రికార్డులు కనుమరుగు
ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన రికార్డు లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) పేరిట ఉంది. కానీ 5 వికెట్ల మార్కును అందుకున్న ఏకైక వీరుడు ప్రియందానా మాత్రమే.
స్కోరు బోర్డులో ఒక పరుగు.. 5 వికెట్లు పతనం!
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 167 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో కంబోడియా 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 106 పరుగులతో పటిష్టంగా ఉంది. ఆ సమయంలో బంతిని అందుకున్న ప్రియందానా విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి కంబోడియా స్కోరు కేవలం 107 పరుగుల వద్దే ఆగిపోయింది. అంటే ఆ ఓవర్లో వచ్చిన 1 పరుగుతోనే జట్టులోని చివరి 5 వికెట్లు పడిపోయాయి. ఇండోనేషియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రికార్డు కొట్టినా దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'
అంతటి అద్భుత రికార్డు సాధించినప్పటికీ ప్రియందానాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కకపోవడం గమనార్హం. ఇండోనేషియా ఓపెనర్ ధర్మ కేసుమ 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచినందుకు ఈ అవార్డును గెలుచుకున్నాడు.
గతంలో మిథున్ అద్భుతం (దేశవాళీ క్రికెట్)
అంతర్జాతీయ స్థాయిలో ప్రియందానా మొదటివాడైనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో గతంలో భారత బౌలర్ అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించాడు. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక తరపున ఆడుతూ మిథున్ ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టాడు.