కోహ్లీకి జ్ఞాపిక అందజేసిన వార్నర్
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిగ్గజ క్రికెటర్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్‌కు సన్మానం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెన్ టాప్ వాహనంలో మైదానంలోకి వచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చప్పట్ల మధ్య ఐపీఎల్ ట్రోఫీ తీసుకొని వేదికపైకి వచ్చాడు. కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రత్యేక జ్ఞాపిక అందజేశాడు.
క్రికెట్ దిగ్గజాలను సన్మానించిన బీసీసీఐ
ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఐపీఎల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తానూ ఊహించలేదని చెప్పాడు.
స్టేజిపైకి వచ్చిన క్రికెట్ దిగ్గజాలు
దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లను బీసీసీఐ సన్మానించనుంది. దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు గోల్ఫ్ కార్ట్‌లలో మైదానంలోకి ప్రవేశించారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు.
నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు జరిగే ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ప్రారంభ వేడుకలు ముగిసిన అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.
కాగా, గత తొమ్మిది సీజన్లలో లీగ్ మ్యాచ్‌లకే పరిమితమైన హైదరాబాద్‌లో తొలిసారిగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్ కూడా జరుగుతుండటం విశేషం. మే 21 వరకు దేశంలోని పది వేదికల్లో 48 రోజుల పాటు ఐపీఎల్ 10వ సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది. ఆరు నిమిషాలపాటు జరిగే ప్రదర్శనలో అమీ స్టేజ్‌ను హీటెక్కించనుంది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ తమ్మ తమ్మ, లెట్స్ నాచో, కర్ గయీ చుల్లా, కాలా చష్మా లాంటి పాటలకు డ్యాన్స్ చేయనుంది.
మూడు వందల మంది కళాకారులతో కలిసి అమీ జాక్సన్ సందడి చేయనుంది. రాష్ట్ర సంస్కృతిని తెలిపే నృత్య రూపకాలను ప్రదర్శించనున్నారు. ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆరంభ మ్యాచ్, మే 21న ఫైనల్ సహా మొత్తం 8మ్యాచ్‌లకు ఉప్పల్ ఆతిథ్యమిస్తుంది.
ఈ మ్యాచ్‌ల కోసం 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 700 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటూన్ల ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మొహరించారు. ఇలా మొత్తంగా 1800మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.