వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు మరింత రసవత్తరంగా మారింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్‌లు జరగనుండటంతో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు సమీకరణాలు తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ క్రికెట్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
కేఎల్ రాహుల్, కేన్ విలియమ్సన్ ఒకే తరహాలో ఔటయ్యారు. ఈ ఇద్దరు ఔటవ్వడంలో సారూప్యత లేనప్పటికీ, లైఫ్ లభించడంలో, ఔటైన స్కోరు ఒకే రీతిలో ఉండటం గమనార్హం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే బొలాండ్ వేసిన మొదటి బంతికి ఔట్ అని భావించి రాహుల్ పెవిలియన్ బాటపట్టాడు. కానీ అది నోబాల్ కావడంతో తిరిగి క్రీజులోకి వచ్చాడు.

వాస్తవానికి కూడా అది ఔట్ కాదు, కానీ ఎడ్జ్ తీసుకుందని భావించి రాహుల్ మైదానాన్ని వీడటానికి సిద్ధమయ్యాడు. కానీ నోబాల్ కావడంతో అంపైర్ నుంచి పిలుపు వచ్చింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన కేఎల్ రాహుల్ 37 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది.
బ్రైడన్ కార్స్ వేసిన మొదట బంతికి కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు. కేన్ మామను కార్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అది నో బాట్ కావడంతో బతికిపోయాడు. తిరిగి బ్యాటింగ్‌ను కొనసాగించిన విలియమ్సన్ కూడా సరిగ్గా 37 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో ఒకే రోజు ఒకే తరహాలో ఇద్దరు బ్యాటర్లు ఔటై.. నాటౌట్‌గా మిగిలి, తిరిగి ఒకే స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరారు. ఇది క్రికెట్‌లో అరుదైన సంఘటన అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లకు 86 పరుగులు చేసింది. కివీస్ 194 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో మొదటి సెషన్ ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (1), పంత్ (4) ఉన్నారు.