Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతో ఎత్తుకు: అక్టోబర్ నెల భారత క్రీడలకు పండుగ తీసుకొచ్చింది

హైదరాబాద్: అక్టోబర్ మాసం.. భారత క్రీడా రంగానికి అన్ని విధాలా కలిసొచ్చింది. దసరా, దీపావళి లాంటి పండుగల పర్వదినాలను మోసుకురావడంతో పాటు భారత క్రీడాకారులు ఈ నెలలో అద్భుత ప్రదర్శనతో చెరగని ముద్ర వేశారు.

అక్టోబర్ నెలలో ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఈవెంట్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. భారత అభిమానులు ఎంతగానో ఆదరించే క్రికెట్ నుంచి మొదలు పెడితే హాకీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌, ఆర్చరీ ఇలా అన్ని పోటీల్లో భారత్ సత్తా చాటింది.

క్రికెట్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత, బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ వరుసగా నాలుగు సూపర్ సిరిస్ విజయాలు, ఆసియా హాకీ టోర్నీలో పదేళ్ల నిరీక్షణకు తెర, ఫిఫా అండర్17 వరల్డ్ కప్‌కు భారత్ తొలిసారి ప్రాతినిథ్యం, ప్రో కబడ్డీలో పట్నా మూడోసారి విజయం, ఆర్చరీలో రికార్డు రజతం, వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో పసిడి... ఇలా భారత్ క్రీడాకారులు అద్భుత విజయాలు సాధించారు.

 కివీస్‌పై కోహ్లీసేన 2-1తో సిరిస్ కైవసం

కివీస్‌పై కోహ్లీసేన 2-1తో సిరిస్ కైవసం

అక్టోబర్ నెలలో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కోహ్లీసేన వరుస విజయాలను సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1తో చిత్తుచేసిన టీమిండియా, తాజాగా కివీస్‌పై 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో వన్డేల్లో వరుసగా ఏడో సిరీస్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 31 సెంచరీల రికార్డుని అధిగమించడంతో పాటు, తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు కోహ్లీ, రోహిత్‌ ఈ ఏడాది వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇలా అక్టోబర్ నెల మొత్తం టీమిండియా తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది.

 ఏడాదిలో నాలుగు సూపర్ సిరిస్‌లు గెలిచిన కిదాంబి శ్రీకాంత్

ఏడాదిలో నాలుగు సూపర్ సిరిస్‌లు గెలిచిన కిదాంబి శ్రీకాంత్

ప్రపంచ బ్యాడ్మింటన్‌పై భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చెరుగని ముద్రవేశాడు. బ్యాడ్మింటన్‌లో ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ అంతర్జాతీయ దిగ్గజాల సరసన చేరిపోయాడు. వారం వ్యవధిలోనే

ఫ్రెంచ్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో జరిగిన అన్నీ టోర్నీల్లోనూ చైనా క్రీడాకారులకు చెక్‌ పెట్టారు భారతీయులు. సింగిల్స్‌, డబుల్స్‌ పోటీల్లో సత్తాచాటారు.

వరుసగా మూడోసారి టైటిల్ గెలిచిన పట్నా పైరేట్స్

వరుసగా మూడోసారి టైటిల్ గెలిచిన పట్నా పైరేట్స్

మూడు నెలలు పాటు కొనసాగిన ప్రో కబడ్డీ లీగ్ అక్టోబర్ నెలతో ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ విజేతగా నిలిచి వరుసగా మూడోసారి టైటిల్‌ సొంతం చేసుకుంది. సుదీర్ఘంగా జరిగిన ఈ లీగ్‌లో ఎదురైన ప్రత్యర్థి జట్లను పట్నా మట్టికరిపించింది. పట్నా కెప్టెన పర్దీప్ నర్వాల్ 369 రైడ్‌ పాయింట్లతో టోర్నీకే హైలైట్‌గా నిలిచాడు.

 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సూపర్ హిట్

ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సూపర్ హిట్

భారత్‌ తొలిసారి ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ పలు అంతర్జాతీయ రికార్డులకు వేదికైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. పిఫా ప్రపంచకప్‌లో గోల్ కొట్టిన తొలి భారత ఆటగానిగా మణిపూర్ ఆణిముత్యంగా జీక్సన్‌సింగ్ చర్రిత సృష్టించాడు. ఈ టోర్నీలో తొలిసారి ఇంగ్లాండ్‌ విశ్వవిజేతగా ఆవిర్భవించింది. టోర్నీని 13,47,143 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌ 179 నమోదయ్యాయి.

 షూటింగ్‌లో స్వర్ణం సాధించిన జీతురాయ్, హీనా సిద్ధు

షూటింగ్‌లో స్వర్ణం సాధించిన జీతురాయ్, హీనా సిద్ధు

ఢిల్లీ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో భారత షూటర్లు జీతూరాయ్, హీనా సిద్ధు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం మిక్స్‌డ్‌ పోటీల్లో స్వర్ణం అందించారు. మిగతా విభాగాల్లో ఒక రజతం, కాంస్యం వచ్చాయి. టోర్నీ మొత్తమ్మీద స్వర్ణం, రజతం, కాంస్యంతో ఇదివరకు ఎన్నడూలేని ప్రదర్శనను భారత్ నమోదు చేసింది. ఇక, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, త్రిష, లిల్లీ చానూతో కూడిన అర్చరీ బృందం మెక్సికోలో జరిగిన ప్రపంచ అర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో రజతం సాధించారు.

ఆసియా కప్ హాకీ టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్ హాకీ టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ సత్తా చాటింది. మూడోసారి ఆసియా కప్‌ కైవసం చేసుకుంది. 2003, 2007 తర్వాత ఇప్పుడు మరోసారి సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బాధ్యతలు తీసుకున్న తొలి టోర్నీలో చీఫ్ కోచ్ జోయర్డ్ మార్జీన్ జట్టును విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను రెండుసార్లు ఓడించి ఫైనల్లో మలేసియాను ఓడించి టైటిల్ విజేతగా అవతరించింది. సీనియర్లు ఇచ్చిన స్ఫూర్తితో సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీలో కుర్రాళ్లు కాంస్యంతో మెరిశారు. ఇక మహిళల, జూనియర్‌ హాకీలోనూ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇలా అక్టోబర్‌ నెల భారత క్రీడా చరిత్రలోనే అద్భుత విజయాలను సొంతం చేసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+