ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన రెండో రోజే లుకలుకలు మొదలయ్యాయి. వివాదాలు చెలరేగుతున్నాయి. తొలి మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ కు సంబంధించిన వివాదం దుమారం రేపగా.. రెండో మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వీటికి కేంద్ర బిందువు అయింది. ఆ జట్టు కేప్టెన్ అజింక్యా రహానే చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ లో చిచ్చు పెట్టాయి. అడిగిందానికి గమ్మున సమాధానం ఇవ్వకుండా లైటర్ వీన్ లో స్పందించడం దీనికి కారణమైంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ వేయలేదు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా యాంకర్ ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. దీనికి తిన్నగా బదులివ్వలేదు రహానే. అతను ఒక్క బంతి కూడా ఎందుకు వేయలేదో ఆస్ట్రేలియా బోర్డుకే తెలుసునని, ఈ ప్రశ్న వారినే అడగాలని రహానే నవ్వుతూ బదులిచ్చాడు. బౌలింగ్ చేయకుండా కామెరాన్ గ్రీన్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు అడ్డుకుందని వ్యాఖ్యానించాడు.

ఇది- క్రికెట్ ఆస్ట్రేలియాకు చిర్రెత్తించింది. రహానే వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించింది. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ తొలి 10-12 రోజులలో గ్రీన్ బౌలింగ్ చేయడని కేకేఆర్‌కు ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. కామెరూన్‌కు వెన్ను కింది భాగంలో గాయమైందని, ప్రస్తుతం అతను దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడని తెలిపింది. కొంతకాలం పాటు బౌలింగ్ నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంద వివరించింది.
ఈ సమాచారాన్ని కోల్ కత నైట్ రైడర్స్ కేప్టెన్, టీమ్ మేనేజ్మెంట్ కు ముందుగానే తెలియజేశామని పేర్కొంది. కొన్ని రోజుల పాటు కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడనే విషయం వారికి తెలుసునని, దీనిపై పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. హర్షిత్ రాణా, మతీషా పతిరనా గాయాలతో జట్టు ఇప్పటికే సతమతమవుతోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా జట్టు నుండి దూరం కావడం బౌలింగ్ డిపార్ట్ మెంట్ బలహీనపడింది.
క్రికెట్ ఆస్ట్రేలియా టైమ్‌లైన్ ప్రకారం కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‌లో కనీసం మొదటి నాలుగు మ్యాచ్‌లలో బౌలింగ్ చేసే అవకాశమే లేదు. ప్రస్తుతానికి కోల్ కత నైట్ రైడర్స్ మ్యాచ్ లేవీ లేవు. ఆ తర్వాత జరిగే వరుస మూడు మ్యాచ్ లు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లపై గ్రీన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడనున్నాడు. బౌలింగ్ కు దూరంగా ఉంటాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుండి అనుమతి లభిస్తేనే అతను బంతిని అందుకుంటాడు.