హైదరాబాద్: గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఆసీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న జీతాల వివాదానికి ఎట్టకేలకు ముగిసింది. క్రికెటర్ల డిమాండ్‌కు ఆస్ట్రేలియా (సీఏ) వెనక్కి తగ్గక తప్పలేదు. గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్‌కు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
గతంలో మాదిరి క్రికెట్ ఆస్ట్రేలియా ఆదాయంలో వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆసీస్ క్రికెటర్లు ఐదేళ్ల కాలానికి సుమారు 396 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సీఏ అంగీకరించింది. ఈ మొత్తం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదాయంలో 30 శాతంగా ఉంది.

తాజా ఒప్పందంతో ఇప్పటిదాకా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భవితవ్యంపై నెలకొన్న సందిగ్థత తొలగిపోయింది. ఈ ఒప్పందం అనంతరం సీఏ చీఫ్ సుదర్లాండ్, ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్ అలిస్టెర్ నికొల్సన్ మాట్లాడుతూ తమ మధ్య చోటు చేసుకున్న ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్ వివాదానికి తెరపడిందని పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ఆటగాళ్లు ఐదేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. కొత్త కాంట్రాక్ట్‌లో కీలక మార్పులు చేయడంతో వాటిపై సంతకాలు చేసేందుకు ఆసీస్ క్రికెటర్లు అందుకు విముఖత వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఆటగాళ్లకు సీఏ మధ్య వివాదం నెలకొంది.
ఎట్టకేలకు ఇద్దరి మధ్య తాజా ఒప్పందం కుదరడంతో అటు క్రికెటర్లు, ఇటు సీఏ ఊపిరిపీల్చుకుంది. దీంతో ఆగస్టు నెలలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ దేశ్ పర్యటనకు వెళ్లనుంది.