ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్షతో ఆరున్నరేళ్ల కాలం తర్వాత సారథి బాధ్యతల నిషేధం నుంచి వార్నర్ విముక్తి పొందాడు. 2018లో కేప్‌టౌన్ టెస్టులో సాండ్ పేపర్ సంఘటనతో వార్నర్ ఏడాది పాటు ఆటకు, జీవితకాలం కెప్టెన్సీకి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.
అయితే 2022లో ప్రవర్తనా నియమావళిలో మార్పులకు అనుగుణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు అధికారులతో కమిషన్‌ను ఏర్పటి చేసింది. అయితే ప్యానెల్‌లోని ముగ్గురూ వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ నిర్ణయంతో బిగ్‌బాష్ లీగ్‌తో డేవిడ్ వార్నర్ తిరిగి సడ్నీ థండర్స్‌కు సారథి బాధ్యతలు అందుకునే అవకాశం దక్కింది.

సాండ్ పాపర్ సంఘటన పట్ల డేవిడ్ వార్నర్ పశ్చాత్తాపం పడుతున్నట్లు ప్యానెల్ భావించి ఈ నిర్ణయం తీసుకుందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అంతేగాక కెప్టెన్సీపై నిషేధం ఎత్తివేస్తే, యువ క్రికెట్ల అభివృద్ధికి వార్నర్ చేయగలిగే సహకారాన్ని గుర్తిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. కాగా, నిషేధం కారణంగా ఆస్ట్రేలియాలో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని వార్నర్ ఆరున్నరేళ్లు కోల్పోయాడు. మరోవైపు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథి బాధ్యతలు నిర్వర్తించాడు.
37 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్ అనంతరం వన్డేలకు, 2024 టీ20 ప్రపంచకప్‌తో పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జట్టుకు అవసరమైతే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని వార్నర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం.