కష్టాల్లో క్రికెట్ ఆస్ట్రేలియా.. సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు!!

మెల్‌బోర్న్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటికే లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. ఎందరో ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా కేవలం వ్యాపారంపైనే కాకుండా క్రీడా రంగంపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతోంది. కరోనా కారణంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఆర్థికంగా బలమైన బోర్డు అయిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా వైరస్ ముందు తలొంచింది. ప్రస్తుతం సీఏ కష్టాల్లో పడింది.

కష్టాల్లో క్రికెట్ ఆస్ట్రేలియా:
సంక్షోభం నుంచి బయటపడటం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా జూన్ వరకు కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలిగిస్తున్నామని సీఏ ప్రకటించింది. అయితే అప్పటివరకు వారి ఉపాధి కోసం తమ స్పాన్సర్లలో ఒకరైన ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కెవిన్ రాబర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు:
కెవిన్ రాబర్ట్స్ తాజాగా సెన్ రేడియోలో మాట్లాడుతూ... 'ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్ సీఈవో బ్రాడ్ బాండుచికి లేఖ రాశాను. ఇతర సంస్థల్లో, పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉన్న మా సిబ్బంది, కల్చర్ టీమ్‌కు తాత్కాలికంగా ఇది ఉపాధిగా ఉపయోగపడుతుంది' అని అన్నారు. 'సీజన్‌ను బట్టి టికెట్లతోనే 40-50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లను బోర్డు అర్జిస్తుంది. కానీ ప్రస్తుతం ఆదాయానికి మార్గం లేదు. అయితే ఉద్యోగుల పట్ల తీసుకున్న నిర్ణయానికి బాధ పడుతున్నా. కానీ వారి సంరక్షణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ సంక్షోభాన్ని మా ఉద్యోగులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్ట్ టైమ్ ఉద్యోగులుగా కోచ్‌లు:
'ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు 20 శాతం, అధికారులకు 80 శాతం జీతాన్ని అందిస్తున్నాం. జాతీయ కోచ్‌లు కూడా పార్ట్ టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో భాగంగా భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మార్చాలని చర్చలు జరుపుతున్నాం' అని కెవిన్ రాబర్ట్స్ చెప్పాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల మెగాటోర్నీకి అంతరాయం కలుగుతుందని, స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టోర్నీని నిర్వహించాలని మాజీలు, నిపుణులు భావిస్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాబర్ట్స్ వెల్లడించారు.

20 మిలియన్ల డాలర్లు నష్టం:
కరోనా కారణంగా దాదాపు 20 మిలియన్ల డాలర్లు నష్టం చూశామని కెవిన్ రాబర్ట్స్ అన్నారు. భవిష్యత్తులో మరింత నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే ఆస్ట్రేలియా బోర్డు తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తాత్కాలికంగా తొలగించింది. మరోవైపు ఆగస్టు నాటికి ఆసీస్ బోర్డు నిధులు అయిపోతాయని నివేదికలు సూచిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications