
మెల్‌బోర్న్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా కంగారూల గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ముగిసింది. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది. ఇక డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్‌డే టెస్టు ప్రారంభంకానుంది. అనంతరం మూడో టెస్ట్ జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూడో టెస్టు సిడ్నీలో జరగడం అనుమానంగా మారింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సిడ్నీలో వైరస్ టెన్షన్ మరీ ఎక్కువగా ఉంది. అయితే భారత్‌తో జరగాల్సిన మూడవ టెస్టుకు వేదిక అయిన సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మెల్‌బోర్న్ వేదికనే స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. ఎంసీజీ మైదానంలో మూడవ టెస్ట్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు సీఏ గురువారం తెలిపింది.
జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ టెస్టు జరగాల్సి ఉంది. కానీ ఆ టెస్టును మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమవుతోందని సమాచారం తెలుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బాక్సింగ్‌డే టెస్టు కూడా మెల్‌బోర్న్‌లో జరగనున్నది. డిసెంబర్ 26వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం న్యూ సౌత్ వెల్స్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టింగ్ జరుగుతోందని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లే తెలిపారు. అయితే కేసులు అదుపులోనే ఉన్నాయని, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే.. అప్పుడు మూడవ టెస్టు కోసం ప్రత్యామ్నాయ వేదిక సిద్ధంగా ఉన్నట్లు నిక్ హాక్లే చెప్పారు.
సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ సీన్ అబాట్ బాక్సింగ్ డే టెస్టుకు దూరమయ్యారని క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా వెల్లడించింది. వార్నర్, అబాట్ సిడ్నీలో ఫిట్‌నెస్ మెరుగు కోసం సాధన చేశారు. ఇద్దరూ గాయం నుంచి కోలుకున్నారు కానీ.. సిడ్నీ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. కరోనా నిబంధనల కారణంగానే ఇద్దరికీ జట్టులో చోటు దక్కలేదు. రెండో టెస్ట్ కోసం ఆసీస్ జట్టులో ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండవని సీఏ పేర్కొంది. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ దూరమవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.