
క్రికెట్‌లో సరికొత్త ప్రయోగానికి తెర లేవనుందా? మూడు ఫార్మాట్లతో నడిచే క్రికెట్‌లో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ రాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు. అంతేకాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లే చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరిస్తున్నాయి. వేర్వేరు ఫార్మాట్లకు, వేర్వేరు కోచ్‌లను నియమించవచ్చని ఆయన ఇటీవల వ్యాఖ్యానించడంతో ఈ చర్చకు తెర లేచింది. నిక్ హాక్లే చేసిన వ్యాఖ్యలను బట్టి గమనిస్తే ఇప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ముగ్గురు కోచ్‌లను నియమించే అవకాశం ఉంది.
వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమించే అంశంపై ప్రస్తుతం ఆలోచించట్లేదని, అయితే ఈ క్రికెట్ సీజన్ ముగిసే లోపు చర్చిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లే చెప్పాడు. యాషెస్ సిరీస్ ముగిశాక ముగ్గురు హెడ్ కోచ్‌ల అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తామని ఆయన తెలిపారు.
అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న జస్టిస్ లాంగర్ ఆ పదవిలోనే కొనసాగుతారని నిక్ హాక్లే స్పష్టం చేశాడు. లాంగర్ కాంట్రాక్టు ముగిసే వరకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడని వివరించాడు. కాగా ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా లాంగర్ పదవి కాలం 2022 జూన్ వరకు ఉంది. దీంతో ఒక వేళ ఆస్ట్రేలియా జట్టుకు ముగ్గురు కోచ్‌లను నియమిస్తే వచ్చే ఏడాది జూన్ తర్వాత నియమించే అవకాశం ఉంది. లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఈ ప్రయోగానికి నాంది పలికితే మాత్రం ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న లాంగర్‌ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి వన్డే, టీ20లకు వేరే కోచ్‌లను నియమించే అవకాశం ఉంది.
ఇలా చేయడం ద్వారా కోచ్‌లపై పని భారం తగ్గుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. పని భారం తగ్గడం ద్వారా కోచ్‌లు మరింత బాగా పని చేయగలుగుతారని అంచనా వేస్తోంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. టెస్టులకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉండగా.. వన్డేలు, టీ20లకు ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు విషయానికొస్తే సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు దుమ్మురేపుతోంది. 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే జరిగిన తొలి రెండు టెస్టులను గెలుచుకుని సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. ప్రస్తుతం మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా అధిక్యంలో కొనసాగుతుంది. ఇదే అధిక్యాన్ని కొనసాగించి మ్యాచ్ గెలుచుకోవాలని భావిస్తోంది. తద్వారా సిరీస్‌లో మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియ పట్టుదలగా ఉంది.