
క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ - 2022 మహిళల ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 13న బిగ్ బాష్ లీగ్ మహిళల టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 27వరకు ఈ లీగ్ కొనసాగుతుంది. టోర్నమెంట్ ఓపెనర్ మ్యాచ్ బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్‌ల మధ్య మాకేలోని రీఫ్ అరేనా గ్రేట్ బారియర్‌లో జరుగుతుంది. చాలా రోజుల్లో డబుల్-హెడర్ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే లీగ్ దశ చివరి రోజు అయిన నవంబర్ 20న క్వాడ్రపుల్-హెడర్లు (నాలుగు మ్యాచ్‌లు) జరుగుతాయి. లీగ్ దశలో మొత్తం 59గేమ్‌లు ఉంటాయి. లీగ్ దశ తర్వాత తొలుత ఎలిమినేటర్ జరుగుతుంది. ఆ తర్వాత ఛాలెంజర్, తర్వాత ఫైనల్ నవంబర్ 27న జరుగుతుంది.
'WBBL టోర్నీ నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇది మహిళల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ టోర్నీ. మేము దేశవ్యాప్తంగా వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ కోసం 14వేదికలను సిద్ధం చేశాం. గతంలో కరోనా వల్ల స్టేడియాల్లోకి హాజరు కావడం సవాలుగా ఉన్న టైంలో వుమెన్స్ బీబీఎల్ పోటీకి రికార్డ్ స్థాయిలో టీవీ వీక్షకుల సంఖ్య లభించింది. WBBL పట్ల ఆదరణ చూపుతున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వేసవిలో (ఆస్ట్రేలియాలో ఆ టైంలో వేసవి ఉంటుంది) మా వేదికల్లో పిల్లలతో పాటు కుటుంబసమేతంగా ప్రేక్షకులు రావాలని ఎదురుచూస్తున్నాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపోతే అక్టోబర్ 13నుంచి జరగాల్సిన అన్ని మ్యాచ్‌ల షెడ్యూళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.