ఇలాక్కూడా నో బాల్ ఇస్తారా - ఇప్పటిదాకా ఎప్పుడూ చూడని విధంగా..!!

బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జింబాబ్వే- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ మరో ఫైనల్ ఓవర్ థ్రిల్లర్‌గా మారింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. లక్ష్యానికి కూతవేటు దూరంలో నిలిచిందీ జట్టు ప్రస్థానం. ఈ విజయంతో బంగ్లాదేశ్- పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది.

హోరాహోరీ పోరు..
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే చివరి వరకూ పోరాడింది గానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లను నష్టపోయి 147 పరుగులే చేయగలిగింది. గెలుపు కోసం ఈ రెండు జట్లు కూడా పోరాట పటిమను ప్రదర్శించాయి. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ నజ్ముల్ హొస్సైన్ శాంటో మినహా మరోవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు.

హీరో.. శాంటో..
జింబాబ్వే బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. శాంటో 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేశాడు. సౌమ్య సర్కార్ డకౌట్ అయ్యాడు. లిట్టన్ దాస్- 14, కేప్టెన్ షకీబుల్ హసన్- 23, అఫీఫ్ హొస్సేన్- 29, మొసాద్దెక్ హొస్సేన్-7, నూరుల్ హసన్- 1 పరుగు చేశారంతే. జింబాబ్వేలో రిచర్డ్ ఎన్‌గరవ, బ్లెస్సింగ్ ముజరబనీ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తడబడిన జింబాబ్వే..
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే ఇన్నింగ్ ఆరంభం నుంచీ తడబడింది. 69 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయిందా టీమ్. తస్కిన్ అహ్మద్ మరోసారి పంజా విసిరాడు. మూడు వికెట్లు నేల కూల్చాడు. మొసాద్దిక్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. జింబాబ్వే టాప్ ఆర్డర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ 64 పరుగులతో సత్తా చాటాడు గానీ.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి అతనికి సహకారం కరవైంది.

సికందర్ డకౌట్..
జింబాబ్వే బ్యాటింగ్ సూపర్ స్టార్ సికందర్ రజా వైఫల్యం కంటిన్యూ అవుతోంది. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రెజిస్ చకబ్వా-15, ర్యాన్ బర్ల్- 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ను గెలిచి ఉంటే జింబాబ్వే సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలు మరింత మెరుగుపడి ఉండేవి.

చివరి ఓవర్‌లో హైడ్రామా..
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. జింబాబ్వే గెలవడానికి చివరి 6 బంతులకు 16 పరుగులు చేయాల్సిన దశ అది. మొసాద్దిక్ ఈ ఓవర్‌ను సంధించాడు. తొలి బంతి లెగ్‌బైగా వెళ్లింది. రెండో బంతికి బ్రాడ్ ఇవాన్స్ అవుట్అయ్యాడు. భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి- డీప్ మిడ్ వికెట్‌లో అఫీఫ్ హొస్సేన్ చేతికి చిక్కాడు. మూడో బంతికి నాలుగు పరుగులొచ్చాయి.. లెగ్‌బై రూపంలో. నాలుగో బంతిని ఎన్‌గరవ సిక్స్‌గా మలిచాడు.

మెరుపు స్టంపింగ్..
అయిదో బంతిని కూడా భారీ షాట్ ఆడటానికి క్రీజ్‌ను వదిలి ముందుకొచ్చాడు. బంతి మిస్ కావడంతో నేరుగా వికెట్ కీపర్ నూరుల్ హసన్ చేతుల్లోకి వెళ్లడం- అతను బెయిల్స్‌ను ఎగురగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆరోబంతి మ్యాచ్ మొత్తానికీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మొసాద్దిక్ వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి..ముజరబని టైమింగ్ మిస్ అయ్యాడు. క్రీజ్ నుంచి బయటికొచ్చాడు. అక్కడ బంతి మిస్ అయింది.

స్టంప్స్‌ను దాటి రావడంతో..
ఆ బంతితో వికెట్లను గిరాటేశాడు. కీపర్ నూరుల్ హసన్. స్టంపౌట్‌గా భావించారందరూ. అంపైర్ మాత్రం దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. బంతిని అందుకునే సమయంలో కీపర్ నూరుల్ హసన్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి ముందుకొచ్చాయి. కీపర్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి వచ్చిన సమయంలో ఐసీసీ నిబంధనల ప్రకారం- ఆ బంతిని నో బాల్‌గా గుర్తించాల్సి ఉంటుంది. అంపైర్ అదే చేశాడు. దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. దీనితో బ్యాటర్ మళ్లీ ముజరబని క్రీజ్‌లోకి వచ్చాడు గానీ ఫ్రీహిట్ బంతికి స్కోర్ చేయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications