టీ20 క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అని మరోసారి రుజువైంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్-2023)లో భాగంగా సెయింట్ కిట్స్, బార్బడోస్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ బ్యాటర్లు రాణించారు. అందరూ తలా ఒక చెయ్యి వేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ముఖ్యంగా చివరి ఓవర్లో సెయింట్ కిట్స్ టీం చెలరేగిందనే చెప్పాలి.
బార్బడోస్ బౌలర్ న్యీమ్ యంగ్ అత్యంత చెత్తగా బౌలింగ్ వేశాడు. అతను వేసిన 3.5 ఓవర్లలో సెయింట్ కిట్స్ బ్యాటర్లు ఏకంగా 54 పరుగులు పిండుకున్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అతను వరుసగా వైడ్, సిక్స్, నోబాల్+1, 4, 6, 0, 6, నోబాల్+6+1 వేశాడు. దీంతో చివరి బంతి వేయకుండానే అతని ఓవర్ ముగించాల్సి వచ్చింది. జేసన్ హోల్డర్ ఆ ఓవర్ ముగించాడు.

దీంతో సెయింట్ కిట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 197/6 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ బార్బడోస్ బ్యాటర్ల ముందు ఈ లక్ష్యం చిన్నబోయింది. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ఆ టీం ఓపెనర్లు రకీం కార్న్‌వాల్ (15 బంతుల్లో 38 పరుగులు), కైల్ మేయర్స్ (17 బంతుల్లో 31 పరుగులు) రాణించారు. ఆ తర్వాత వచ్చిన జేసన్ హోల్డర్ (24), అలిక్ అథనాజ్ (30) కూడా ఆకట్టుకున్నారు. ఇక చివర్లో బార్బడోస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు.
ఎదుర్కొన్న ప్రతి బంతికి బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా పావెల్ చెలరేగడంతో బార్బడోస్ లక్ష్యం మంచులా కరిగిపోయింది. చివరకు ఆ జట్టు 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న బార్బడోస్ బౌలర్ ఖయాస్ అహ్మద్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.