పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో వెస్టిండిస్ దిగ్గజం క్రిస్ గేల్ 54 బంతుల్లో 108 పరుగులు సాధించి మరో రికార్డుని నమోదు చేశాడు. సీపీఎల్ లీగ్‌లో జమైకా తల్లవాస్ తరుపున ఆడుతున్న క్రిస్‌గేల్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. సోమవారం రాత్రి ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, జమైకా తల్లవాస్ మద్య క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రిస్ గేల్ చెలరేగిపోయి ఆడాడు.
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుపడిన క్రిస్‌గేల్ 11 సిక్సులు, 6 ఫోర్లతో సెంచరీని సాధించాడు. దీంతో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తల్లవాస్ గేల్ సెంచరీతో 18.2 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ సెంచరీ గేల్‌కు టీ20 ఫార్మెట్‌లో 18వ సెంచరీ. క్రిస్ గేల్ ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ స్ట్రయిక్ రేట్ 200గా ఉంది. గేల్ తర్వాత అత్యుత్తమ స్కోరు సాధించిన ఆటగాడిగా అండ్రూ రస్సెల్ ఉన్నాడు. 18 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. టీ20 మ్యాచ్‌లంటే చెలరేగి పోయి ఆడే క్రిస్‌గేల్ ఇండియన్ ప్రీమయిర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్నాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2016లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో ఫైనల్‌లో తలపడిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ చిన్నపాటి తప్పిదాల వల్ల విజేతగా నిలవలేకపోయింది. తొలుత ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుపున బరిలోకి దిగిన హషీం ఆమ్లా 74, కోలిన్ మున్రో 55 పరుగులు చేసి జమైకా తల్లవాస్ లక్ష్యాన్ని 192గా నిర్దేశించారు.