
జార్జ్‌టౌన్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఛాంపియన్‌గా జమైకా తల్లవాస్ ఆవిర్భవించింది. ఫైనల్స్‌లో బార్బడొస్ రాయల్స్‌పై జయకేతనాన్ని ఎగురవేసింది. ఎనిమిది వికెట్లే తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సీపీఎల్ 2022 టైటిల్‌ను సొంతం చేసుకోవడం జమైకా త్లలవాస్‌కు ఇది మూడోసారి. ఓపెనర్ బ్రెండన్ కింగ్ దుమ్ము దులిపాడు. బార్బడొస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లో 83 పరుగులతో చివరివరకూ నిలిచాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడొస్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు రకీం కార్న్‌వెల్, కైలే మేయర్స్ శుభారంభం చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 63 పరుగులు జోడించారు. ఆరంభం అద్దిరిపోయినప్పటికీ- ఆ తరువాత దాన్ని కొనసాగించలేకపోయిందా టీమ్. ఓపెనర్లు ఇచ్చిన భారీ భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకోలేకపోయారు ఆ తరువాతి బ్యాటర్లు. ప్రత్యేకించి మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
వన్‌డౌన్ బ్యాటర్ ఆజం ఖాన్ 40 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. జేసన్ హోల్డర్, నజీబుల్లా జడ్రాన్, కోర్బిన్ బోష్క్, డెవాన్ థామస్, ముజీబుర్ రెహ్మాన్ పెద్దగా రాణించలేకపోయారు. దీనితో బార్బడొస్ రాయల్స్ 161 పరుగులే చేయగలిగింది. ఫాబియన్ అలెన్, నికొల్సన్ గోర్డాన్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇమద్ వసీం ఓ వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమైకా తల్లవాస్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది. ఓపెనర్ కెన్నర్ విలియమ్స్ గోల్డెన్ డక్ రిజిస్టర్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్ మాత్రం చెలరేగాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
వన్‌డౌన్ బ్యాటర్ షమర బ్రూక్స్ అతనికి అండగా నిలిచాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో బ్రూక్స్ 47 పరుగులు చేసి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేప్టెన్ రౌమన్ పావెల్ 13 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్సర్ ఉంది. బ్రెండన్ కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డను అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బౌలర్ ఫాబియన్ అలెన్‌ను వరించింది.