Faf du Plessis: 60 బంతుల్లో 120 రన్స్: ధోనీ సేనకు కొత్త ఊపిరి: ఐపీఎల్ ముంగిట్లో సెంచరీ

సెయింట్ కిట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2021 (CPL 2021) రసవత్తరంగా సాగుతోంది. భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బ్యాట్స్‌మెన్లు సెంచరీలను అందుకుంటున్నారు. పిడుగుల్లాంటి షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపుతున్నారు. టీ20 ఫార్మట్‌లో కాస్త అరుదుగా నమోదయ్యే సెంచరీలు.. ఈ టోర్నమెంట్‌లో వరుస పెట్టాయి. ఒకేసారి రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. సెంచరీల దెబ్బకు భారీ స్కోర్లు రికార్డవుతోన్నాయి.
సెయింట్ లూసియా కింగ్స్ భారీ స్కోర్..
సెయింట్ కిట్స్ బస్సెటెర్రెలోని వార్నర్ పార్క్ స్టేడియం వేదికగా సెయింట్ లూసియా కింగ్స్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ రికార్డయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 224 పరుగులను సాధించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయిందా టీమ్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్.. 124 పరుగులకే చతికిల పడింది.
ఫాఫ్ డుప్లెసిస్ భారీ సెంచరీ
సెయింట్ లూసియా కింగ్స్ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. ఆ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 60 బంతుల్లో దానికి రెండింతలు స్కోర్ సాధించాడు. 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్‌లో 13 ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ ఛేజ్ సైతం భారీ షాట్లు ఆడాడు. 31 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. వారిద్దరి బ్యాటింగ్ వేగానికి లూసియా కింగ్స్ 224 పరుగుల రికార్డు స్కోర్‌ను సాధించింది.
సీఎస్‌కేకు ఊపిరి..
ఇంకొద్ది రోజుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ ఆరంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో డుప్లెసిస్ సెంచరీ అందుకోవడం.. అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఊపిరిని పోసినట్టయింది. ఇదే ఫామ్‌ను అతను ఐపీఎల్‌లో కొనసాగిస్తాడనటంలో సందేహాలు అక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏడు మ్యాచుల్లో అయిదు విజయాలను అందుకుందా టీమ్.
124 పరుగులకే..
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయింది. విజయం వైపు అడుగులు వేయలేకపోయింది. డెవాన్ థామస్, ఎవిన్ లెవిస్, క్రిస్ గేల్ వంటి స్టార్లు ఉన్న ఈ టీమ్ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన తరువాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వంద పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.
ఎవిన్ లూయిస్ ఒక్కడే..
డెవాన్ థామస్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక్కడే పోరాడాడు. 42 బంతుల్లో అయిదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. అతని ఒంటరిపోరాటానికి సహకరించే బ్యాట్స్‌మెన్లు లేరు. క్రిస్ గేల్ 14 పరుగులే చేసిన అందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. షెఫానె రూథర్‌ఫర్డ్ 11 పరుగులు చేశాడు. మిగిలిన వారెవరూ కనీసం డబుల్ డిజిట్స్ కూడా అందుకోలేకపోయారు. అల్జారీ జోసెఫ్, కీమో పాల్ మూడు వికెట్లు చొప్పున తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications