గయానా వారియర్స్ వర్సెస్ బార్బడొస్ రాయల్స్..
సెయింట్ కిట్స్‌లోని బస్సెటెర్రె స్టేడియం వేదికగా బార్బడొస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. గయానా వారియర్స్ అన్ని రంగాల్లోనూ సత్తా చాటారు.. అద్భుతంగా రాణించారు. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో తిరుగులని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థిని ఎక్కడికక్కడ కట్టి చేశారు. భారీ వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు.
130 పరుగులకే ఆలౌట్..
బస్సెటెర్రె స్టేడియంలో బార్బడొస్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. గయానా వారియర్స్ బౌలర్ల ధాటికి కకావికలమైందా టీమ్ బ్యాటింగ్ ఆర్డర్. నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగలకే బార్బడొస్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లు ఆల్ అవుట్ అయ్యారు. 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన రాయల్స్.. ఇక ఎక్కడే గానీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరికి 130 పరుగలకు కుప్పకూలిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్ ఆజమ్ ఖాన్ ఒక్కడే టాప్ స్కోరర్. 26 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులతో చేశాడతను.
సత్తా చాటిన ఇమ్రాన్ తాహిర్..
గయానా అమెజాన్ వారియర్స్ వెటరన్ బౌలర్, దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. మూడు వికెట్లను పడగొట్టాడు. 40 ప్లస్ ఏజ్‌లోనూ తన బౌలింగ్ పదును ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులను ఇచ్చిన తాహిర్.. మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఒక కాట్ అండ్ బౌల్ కూడా ఉంది. రొమారియా షెప్పర్డ్ రెండు, గుడకేష్ మోటె, ఒడెయాన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.
సునామీ ఇన్నింగ్..
131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా అమెజాన్ వారియర్స్ సుడిగాలి ఇన్నింగ్‌ను ఆడింది. 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ చంద్రపాల్ హేమ్‌రాజ్.. సునామీని తలపించే ఇన్నింగ్ ఆడాడు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు స్టేడియంలో చుక్కలు చూపాడు. 56 బంతుల్లో 14 ఫోర్లను బాదాడు. అయిదు భారీ సిక్సర్లను సాధించాడు. చంద్రపాల్ బ్యాటింగ్ దెబ్బకు బౌలర్ల లెక్కలన్నీ తారుమారయ్యాయి.
మూడో స్థానానికి
ఒషానె థామస్, బార్బడొస్ రాయల్స్ కేప్టెన్ జేసన్ హోల్డర్ ధారాళంగా పరుగులను ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారిద్దరూ కలిసి నాలుగు ఓవర్లలోనే 49 పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చిందంటే గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటింగ్ దూకుడు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో గయానా అమెజాన్ వారియర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్.. మూడు మ్యాచుల్లో గెలుపును రుచి చూసింది.


Click it and Unblock the Notifications












