
అడ్డుకున్న వరణుడు:
గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచును వరణుడు ఆదిలోనే అడ్డుకున్నాడు. మ్యాచ్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో 17 ఓవర్లుగా అంపైర్లు కుదించారు. టాస్ గెలిగిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. తొలి ఓవర్‌లోనే వారియర్స్‌కు బౌలర్ అలీ ఖాన్ షాకిచ్చాడు. మూడో బంతికే ఓపెనర్ బ్రెండన్ కింగ్ (0)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ చందర్‌పాల్ హేమరాజ్ కూడా (3) విఫలమయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వారియర్స్ 23 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మైర్, రాస్ టేలర్ జట్టును ఆదుకున్నారు. ఓపికగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.

టేలర్ వేగం:
ఫవాద్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి ఓవర్ డీప్ వికెట్ మీదుగా రాస్ టేలర్ అద్భుత సిక్సర్‌తో.. ధనా ధన్ లీగ్ రుచి చూపించాడు. సీల్స్ వేసిన మరుసటి ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి టేలర్ మరింత వేగం పెంచాడు. మరోవైపు హెట్‌మైర్ కూడా వేగం పెంచడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న స్థితిలో నరైన్ అద్భుత బంతితో టేలర్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 33) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

హెట్‌మైర్ హాఫ్ సెంచరీ:
అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (18) నిదానంగా ఆడినా.. మరో ఎండ్‌లో హెట్‌మైర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ సిక్స్, రెండు బౌండరీలతో పూరన్ టచ్‌లోకి రాగా.. సీల్స్ దెబ్బతీశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పూరన్ వెనుదిరిగాడు. ఆ వెంటనే రూథర్ ఫోర్డ్ (0) వచ్చిరాగానే ఔటయ్యాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ (41 బంతుల్లో 2 సిక్స్, 2 ఫోర్లతో 63 నాటౌట్) ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కీమో పాల్ కూడా (10 బంతుల్లో 1 ఫోర్‌తో 14) ఓ చేయి వేయడంతో.. 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. హెట్‌మైర్ నాటౌట్‌గా నిలిచాడు. నరైన్ రెండు వికెట్లు తీశాడు.

చెలరేగిన సునీల్ నరైన్:
లక్ష్య చేధనలో నైట్‌రైడర్స్ మరో రెండు బంతులు ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఛేదనలో నైట్‌రైడర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లెండీ సిమ్మన్స్ (17) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ సునీల్ నరైన్ మాత్రం వీరవిహారం చేశాడు. ఆదినుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా సిక్సుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ (50; 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు. అతనికి కొలిన్ మున్రో (17), డారెన్ బ్రేవో (30) మంచి సహకారం అందించారు. నరైన్ పెవిలియన్ చేరినా.. పోలార్డ్ (), బ్రేవో (6) విజయాన్ని అందించారు. నవీన్ రెండు వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications
