
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020లో బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు బౌలర్లు చెలరేగుతున్నారు. ప్రతిరోజు ఒకే పిచ్‌పైనే మ్యాచులు జరుగుతుండడంతో లో స్కోరింగ్ నమోదవుతున్నా.. బౌలర్లు తమ జట్లకు విజయాలను అందిసున్నారు. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచులో సెయింట్ లూసియా జూక్స్ బౌలర్లు కేస్రిక్ విలియమ్స్, జావెల్లె గ్లెన్ సూపర్ బౌలింగ్‌తో బార్బడోస్ ట్రైడెంట్స్ బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేశారు. ఫలితం 92 పరుగులను కాపాడుకున్న సెయింట్ లూసియా.. 3 పరుగులతో విజయాన్ని అందుకుంది.
మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జూక్స్ 18 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు రఖీమ్ కార్న్‌వాల్ (6), ఆండ్రీ ఫ్లెచర్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. 12 పరుగులకే సెయింట్ లూసియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో లెనికో బౌచర్ (18), రోస్టన్ చేజ్ (14) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 8 పరుగుల వ్యవధిలో హేడెన్ వాల్ష్ ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చి.. సెయింట్ లూసియాను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 50 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
నజీబుల్లా జద్రాన్ (22) క్రీజులో నిలబడినా.. మొహమ్మద్ నబీ (2), కెప్టెన్ డారెన్ సామీ (2) త్వరగానే ఔట్ అయ్యారు. జావెల్లె గ్లెన్ (8), కుగ్గెలీజ్న్ (7) అండతో నజీబుల్లా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. బార్బడోస్ బౌలర్లు రీఫెర్, నర్స్, రషీద్ వికెట్లు వెంటవెంటనే తీయడంతో సెయింట్ లూసియా 92 పరుగులకే ఆలౌట్ అయింది. బార్బడోస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3, రీఫెర్ 2 వికెట్లు పడగొట్టాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్, షై హోప్.. 32 పరుగులు జోడించారు. హోప్ (14))ను విలియమ్స్ ఔట్ చేయడంతో బార్బడోస్ వికెట్ల పతనం ఆరంభమయింది. కైల్ మేయర్స్ (2),
జాసన్ హోల్డర్ (1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో సెయింట్ లూసియా బౌలర్లు పరుగులు ఇవ్వలేదు. కోరే ఆండర్సన్ (11), నర్స్ (12) ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఎక్కువ బంతులు ఆడారు. రషీద్ (2), రీఫెర్ (2), యుంగ్ (2) పోరాడినా ఫలితం లేకపోయింది. విలియమ్స్, గ్లెన్ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. గ్లెన్ 3 ఓవర్లలో 11, విలియమ్స్ 3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.