
పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఇక సీపీఎల్ 2020 ఎడిషన్‌లో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించనున్నాడు.
సీపీఎల్ 2019 ఎడిషన్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను సారథిగా జట్టు యాజమాన్యం నియమించింది. అయితే కారణంగా అతడు మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు. దీంతో కీరోన్ పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించాడు. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. రెండవ క్వాలిఫైయర్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ చేతిలో ట్రిన్‌బాగో పరాజయం పాలైంది. పొలార్డ్ అద్భుత కెప్టెన్సీకి ఫిదా అయిన ప్రాంచైజీ అతనినే కొనసాగించింది. ఇప్పుడు జట్టులో బ్రావో కూడా ఉన్నాడు.
ఈసారి వేలంలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 48 ఏళ్ల భారత లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రాజా మరియు స్థానిక ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ఫిలిప్‌లను తీసుకుంది. ఆగస్టు 18న బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచులో గయానా అమెజాన్ వారియర్స్ తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తలపడనుంది. గయానా గత సంవత్సరం రన్నరప్‌గా నిలిచింది.
సీపీఎల్‌లో ఆడేందుకు ట్రినిడాడ్ మరియు టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు, నిర్వాహకులతో కూడిన మొత్తం 162 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని తాజాగా సీపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వీరంతా అక్కడి హోటల్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఈ సమయంలో వీరందరికి రెగ్యులర్‌గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. సీపీఎల్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు అందరూ ఆగస్టు 1నే ట్రినిడాడ్ మరియు టొబాగోకు చేరుకున్న విషయం తెలిసిందే.
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు:
డ్వేన్ బ్రావో, కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్, కోలిన్ మున్రో, ఫవాద్ అహ్మద్, డారెన్ బ్రావో, లెండ్ల్ సిమన్స్, ఖరీ పియరీ, ఖరీ పియరీ, టిమ్ సీఫెర్ట్, సికందర్ రాజా, అండర్సన్ ఫిలిప్, ప్రవీణ్ తంబే, జాడెన్ టామెన్, జాడెన్ , ముహమ్మద్ అలీ ఖాన్.