
తరౌబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ లూసియా జూక్స్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ 4 వికెట్లతో రెచ్చిపోవడంతో సెయింట్ లూసియా 19.1 ఓవర్లో 154 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రిన్‌బాగో లక్ష్యం 155 పరుగులు. ఈ సాధారణ స్కోర్ పోలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో అందుకుంటుందో చూడాలి. సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్ ఆండ్రీ ఫ్లెచర్ (39), మార్క్ డీయల్ (29) మోస్తరుగా రాణించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జూక్స్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రకీమ్ కార్న్‌వాల్ (8) త్వరగానే పెవిలియన్ చేరాడు. అకీల్ హోసిన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది కార్న్‌వాల్ మంచి ఊపులో ఉన్నాడు. అయితే అలీ ఖాన్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికే కార్న్‌వాల్ బోల్డ్ అయ్యాడు. దీంతో 9 పరుగులకే సెయింట్ లూసియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో మార్క్ డీయల్, ఆండ్రీ ఫ్లెచర్ సెయింట్ లూసియా స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మంచి షాట్లతో అలరించారు.
మార్క్ డీయల్, ఆండ్రీ ఫ్లెచర్ జోడి ట్రిన్‌బాగో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫ్లెచర్ వేగంగా పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆపై డీయల్‌ను ఫవాద్ అహ్మద్.. ఫ్లెచర్‌ను పోలార్డ్ పెవిలియన్ చేర్చారు. ఇక రోస్టన్ చేజ్ (22), నజీబుల్లా జద్రాన్ (24) స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. అయితే పోలార్డ్ చెలరేగడంతో ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇక్కడి నుంచి సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్ తడబడ్డారు.
స్టార్ ప్లేయర్ మొహమ్మద్ నబీ (2) పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్ డారెన్ సామీ (8) రాగానే ఓ సిక్సర్ బాదినా.. ఆపై మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ జూపించలేకపోయాడు. ట్రిన్‌బాగో బౌలర్ల ధాటికి జావెల్లె గ్లెన్ (9), కేస్రిక్ విలియమ్స్ (3), జహీర్ ఖాన్ (0) పరుగులు చేయలేకపోయారు. కుగ్గెలీజ్న్ (2) నాటౌట్‌గా ఉన్నాడు. ట్రిన్‌బాగో బౌలర్లలో పోలార్డ్ 4, అలీ ఖాన్ 2, ఫవాద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.