వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలై ట్రోఫీని చేజార్చుకుంది. టోర్నీ ఆద్యంతం గొప్పగా రాణించిన భారత్ తుదిపోరులో మాత్రం తడబడింది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచింది. మైదానాన్ని వీడుతూ భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ప్రపంచకప్ ఓటమి అనంతరం దాదాపు 20 రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
''ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం ఆ బాధ నుంచి ఎలా బయటకు రావాలో తెలియలేదు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాతోనే ఉంటూ ఓటమి బాధ నుంచి బయటపడేలా తోడుగా ఉన్నారు. అయితే ఆ బాధను మర్చిపోవడం అంత ఈజీ కాదు. కానీ లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. అది కూడా ఈ విషయంలో అంత సులువు కాదు''

''వన్డే వరల్డ్ కప్‌ను చూస్తూ పెరిగాను. నాకు అదే అన్నింటికంటే గొప్ప బహుమతి. ఇన్నేళ్లు దాని కోసం ఎంతో కష్టపడ్డాం. మన కల కోసం తీవ్రంగా ప్రయత్నించినా దక్కపోతే అది ఎంతో బాధను కలిగిస్తుంది, చిరాకుగా అనిపిస్తుంది. మా శాయశక్తులా ప్రయత్నించాం''
''తప్పు ఎక్కడ జరిగిందని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే 10 మ్యాచ్ ల్లో గెలిచాం. అయితే ఆ పది మ్యాచ్ ల్లో కూడా మేం కొన్ని పొరపాట్లు చేశాం. మనం ఆడే ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక తప్పు ఉంటూనే ఉంటుంది. తప్పులు చేయలేని మ్యాచ్ ఎప్పటికీ ఉండదు. మా జట్టు పట్ల ఎంతో గర్వపడుతున్నా. అద్భుతంగా పోరాడాం. ప్రతి ప్రపంచకప్ లో ఇలానే గొప్పగా రాణించలేరు. కానీ, ఫైనల్ వరకు గొప్పగా మా ప్రయాణం సాగింది. మీ అందరూ గర్వపడేలా ఆడాం''
''ఫైనల్ ఓటమి తర్వాత ఆ బాధ నుంచి బయటపడటానికి ఎటైనా వెళ్లాలనుకున్నా. ఆ ఆలోచనల నుంచి బయట పడాలనుకున్నా. అయితే ప్రతి ఒక్కరు మా ఆటను కొనియాడారు. అది నాకు ఎంతో ఊరటనిచ్చింది. ఇక ప్రపంచకప్ సాధించడం మా ఒక్కరి కల మాత్రమే కాదు మీ అందరిది. 45 రోజుల పాటు స్టేడియానికి వచ్చిన అభిమానులకు, టీవీలో చూసే ప్రేక్షకులకు, మాకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి స్థితిలో ప్లేయర్లపై కోపం, చిరాకు చూపిస్తుంటారు. కానీ మీరు అలా చేయలేదు. ప్రేమ చూపించారు. ఇది మాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ప్రపంచకప్ గురించి ఇంకా మాట్లాడితే నిరాశలోకి వెళ్తా. మొత్తంగా మేం కప్‌ను అందుకోలేకపోయాం. అయితే మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరో ట్రోఫీ కోసం మళ్లీ ప్రయత్నిస్తాం'' అని రోహిత్ అన్నాడు.