హైదరాబాద్: బౌలింగ్ యాక్షన్ సరిగా లేదన్న కారణంతో టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన లెప్ట్ ఆర్మ్ స్నిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా త్వరలో జరగనున్న రంజీ కోసం సన్నద్ధమయ్యాడు. ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన ఓజా ఇకపై బెంగాల్ జట్టు తరుపున ఆడనున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తనతో బెంగాల్ జట్టుకు ఆడమని కోరాడని తెలిపాడు. గంగూలీ అడగడంతో కాదనలేకపోయానని వివరించాడు. జాతీయ జట్టులో స్ధానం కోల్పోయిన నేపథ్యంలో మంచి జట్టు తరుపున ఆడడం కూడా ముఖ్యమన్న విషయాన్ని గుర్తించానని చెప్పాడు.

బెంగాల్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్నానని, 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్ఓసీ) కూడా సిద్ధంగా ఉందని తెలిపాడు. ఓడిశాకు చెందిన ప్రజ్ఞాన్ ఓజా 2001 నుంచి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
టీమిండియా తరుపున 24 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చివరి టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా తీసుకున్నాడు. 2013లో వెస్టిండిస్‌తో ముంబైలోని వాంఖడె స్డేడియంలో జరిగిన మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.