
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు వైరస్ ఎవరినీ విడిచి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని గంభీరే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు ఆయన తెలిపారు. దీంతో తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని గంభీర్ కోరారు.
2003 నుంచి 2018 వరకు అంటే 16 సంవత్సరాలపాటు గంభీర్ క్రికెట్ ఆడారు. ఈ క్రమంలో భారత్ జట్టులో గంభీర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో టీమిండియా వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లు గెలవడంతో కీలక పోషించారు. అలాగే ధోని నాయకత్వంలో టెస్టు క్రికెట్‌లో టీమిండియా నంబర్ వన్‌గా నిలవడంలోనూ కీలకపాత్ర పోషించారు. వన్డే, టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసి టీమిండియాను గెలిపించారు. అలాగే గంభీర్ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. తన కెరీర్‌లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కలో గంభీర్ 58 మ్యాచ్‌లు ఆడాడు. 41 సగటుతో 4154 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ సారి డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నారు. అత్యధిక స్కోర్ 206 పరుగులు. ఇక 147 వన్డేల్లో 39 సగటుతో 5238 పరుగులు చేశారు. ఇందులో 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 150 పరుగులు. ఇక 37 టీ20ల్లో 27 సగటుతో 932 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 75 పరుగులు.
ఇక 2018లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్ రాజకీయాల్లో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక వైపు రాజకీయాల్లో ఉంటూనే, మరొక వైపు క్రికెట్‌లోనూ గంభీర్ పలు పదవుల్లో కొనసాగుతున్నారు. కామెంటేటర్‌గా రాణిస్తున్నారు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో మెంటార్‌గా కూడా ఉండనున్నారు. కొత్త జట్టు లక్నో గంభీర్‌ను తమ టీంకు మెంటార్‌గా నియమించుకుంది.